Preacher arrested for raping 5-year-old girl inside mosque: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. 2023లో ఒక మసీదులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఓ మత బోధకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహాలింగ్‌పూర్‌కు చెందిన తుఫైల్ అహ్మద్ దాదఫీర్ అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడు. సామాజిక మాధ్యమాలు, సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరం బయటపడిన తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి భవిష్యత్తు కోసం భయపడి..
ఈ ఘటన గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగినప్పటికీ, ఇటీవల ఓ సామాజిక కార్యకర్త ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు బాధితురాలిని, నిందితుడిని, అలాగే నేరం జరిగిన ప్రాంతాన్ని గుర్తించారు. ఈ దారుణం మసీదులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. అయితే తమ బిడ్డ భవిష్యత్తు గురించి ఆందోళనతో బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
పోలీసులే స్వయంగా బాలిక తండ్రిని సంప్రదించి, ఫిర్యాదు చేయాలని కోరినా ఆయన నిరాకరించాడు. దీంతో బెళగావి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ రంగంలోకి దిగి, బాధితురాలి తరపున కేసు నమోదు చేసింది. ఆ తర్వాత పోలీసులు తుఫైల్ అహ్మద్ దాదఫీర్‌ను అరెస్ట్ చేశారు. అతను ప్రధానంగా వెల్డర్‌గా పనిచేస్తూ అప్పుడప్పుడు మసీదులలో ప్రసంగాలు ఇస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.


