Rajasthan road accident : దైవ దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న వారిని మృత్యువు కబళించింది. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 11 మందిని పొట్టన పెట్టుకుంది. వీరిలో ఏడుగురు పసిపిల్లలే కావడం హృదయాలను ద్రవింపజేస్తోంది. అసలు ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది..? దీనికి కారణాలేంటి..?
రాజస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి, పెను విషాదాన్ని మిగిల్చింది. దౌసా జిల్లాలోని మనోహర్‌పుర్ హైవేపై బాపి సమీపంలో భక్తులతో వెళ్తున్న పికప్ వ్యాన్‌ను కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు.
అసలేం జరిగింది : పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాధితులంతా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని తేలింది. వీరంతా రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఖాటు శ్యామ్ ఆలయంలో దర్శనం పూర్తి చేసుకుని, తమ సొంతూరికి పికప్ వ్యాన్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో, మనోహర్‌పుర్ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కంటైనర్ అదుపుతప్పి వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు పికప్ వ్యాన్ నుజ్జునుజ్జయింది. అందులోని ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వాహనంలోనే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నుజ్జునుజ్జయిన వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం జైపుర్‌లోని పెద్ద ఆసుపత్రికి తరలించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దీపక్ మహేశ్వరి, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ గిర్ధర్ గోయల్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించారు.
ప్రభుత్వాల స్పందన : ఈ ఘోర ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులకు సాధ్యమైనంత ఉత్తమ వైద్య సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తమ అధికారులను ఆదేశించినట్లు యూపీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.


