Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుLover Killed Woman: పెళ్లి కోసం 600 కి.మీలు ప్రయాణించిన మహిళ.. ప్రియుడి చేతిలోనే దారుణ...

Lover Killed Woman: పెళ్లి కోసం 600 కి.మీలు ప్రయాణించిన మహిళ.. ప్రియుడి చేతిలోనే దారుణ హత్య

Lover Killed Woman: పశ్చిమ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 600 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన తన ప్రియురాలిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ముకేష్ కుమారి (37) అనే అంగన్‌వాడీ సూపర్ వైజర్, పాఠశాల ఉపాధ్యాయుడు మనారామ్ మధ్య ఏర్పడిన ప్రేమ బంధం విషాదంగా ముగిసింది.
ఝుంఝును జిల్లాలో ఉండే ముకేష్ కుమారికి, బార్మర్ జిల్లాకు చెందిన మనారామ్‌తో గత సంవత్సరం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి తరచుగా కలుసుకునేవారు. ముకేష్ తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. మనారామ్‌కి ఇంకా విడాకులు మంజూరు కాలేదు. తనను పెళ్లి చేసుకోవాలని ముకేష్ మనారామ్‌ను తరచుగా కోరుతూ ఉండేది. దీంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఈ నెల 10న ముకేష్ తన కారులో ఝుంఝును నుంచి 600 కిలోమీటర్లు ప్రయాణించి మనారామ్ ఇంటికి వెళ్లింది. తమ ప్రేమ గురించి అతని కుటుంబ సభ్యులకు చెప్పడంతో మనారామ్‌కు కోపం వచ్చింది. విషయం పోలీసుల వరకు వెళ్లగా, ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు, పెళ్లి విషయంపై మళ్లీ గొడవ జరిగిందని, ఆవేశంలో మనారామ్ ఇనుప రాడ్‌తో ముకేష్ తలపై బలంగా కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
హత్య తర్వాత, ముకేష్ మృతదేహాన్ని ఆమె కారులోనే డ్రైవింగ్ సీట్‌లో ఉంచి, ప్రమాదంగా కనిపించేలా కారును రోడ్డు పక్కన పడేశాడు. ఆ తర్వాత అతను తన రూమ్‌కి తిరిగి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు తన లాయర్‌తో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అనేక అనుమానాలు కలిగాయి.
హత్య జరిగిన సమయంలో ముకేష్, మనారామ్ ఫోన్ లొకేషన్లు ఒకే చోట ఉండటంతో పోలీసులు మనారామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గట్టిగా విచారించగా, అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ముకేష్ మృతదేహం బార్మర్ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంది. ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. బార్మర్ ఎస్పీ నరేంద్ర సింగ్ ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad