Accident at Nasarlapally: పండుగ పూట తీరని విషాదం చోటుచేసుకుంది. నిండా ముప్పై ఏళ్లు కూడా లేని ముగ్గురు యువకులు ఘోర రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు వద్ద సోమవారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారిపై ఆటో, కారు ఢీ కొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Also Read: https://teluguprabha.net/crime-news/indian-army-intel-leak-pakistan-haryana-spy-arrested/
హైదరాబాద్ నుంచి దేవరకొండకు నలుగురు యువకులు ఆటోలో వెళ్తున్నారు. చింతపల్లి మండలం నరసర్లపల్లి వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టి ఎదురుగా వస్తున్న కార్లను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొక యువకుడికి గాయాలయ్యాయి. స్థానికులతోపాటు అదే రహదారిపై వెళ్లున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: https://teluguprabha.net/crime-news/swamy-chaitanyananda-saraswati-arrest-in-delhi/
పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ముదిగొండ అవాసం మటిక తండా వాసులుగా గుర్తించారు. రాత్లావత్ భాస్కర్ (29), రాత్లావత్ వినోద్ (29), సఫవత్ రవి (29)గా గుర్తించినట్లు పోలీసులు వివరించారు.


