Road accident: బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
10 మంది పరిస్థితి విషమం: మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున చింతామణి సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో.. బస్సు వేగంగా లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన 20 మందిలో.. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read-Earthquake: భద్రాద్రి జిల్లాలో భూకంపం.. భయాందోళనలో స్థానిక ప్రజలు!
నిద్రమత్తు కారణంగానే ప్రమాదం?: క్షతగాత్రులను వెంటనే స్థానికులు, పోలీసులు కలిసి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

