Kakinada Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలంని సోమవరం వద్ద పెళ్లి కారు అదుపుతప్పి బస్సు షెల్టర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయినట్టుగా తెలుస్తోంది. అదుపుతప్పిన కారు బస్సు షెల్టర్‌లో ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. వెంటనే ఘటనాస్థాలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనాస్థలికి హుటాహుటిన వెళ్లి ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఎమ్మెల్యే కోరారు.
ఫ్రంట్ టైర్ పేలడంతోనే ప్రమాదం: అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన బస్సు షెల్టర్‌లో బస్సు కోసం వేచి ఉన్న ఆరుగురు ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. అనంతరం పక్కనే ఉన్న బైక్, రిక్షాను సైతం ఢీకొట్టింది. గాయపడిన ఏడుగురిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది.


