Nalgonda Road accident: రోడ్డు ప్రమాద వార్త వింటేనే తెలుగు రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండు వారాల నుంచి ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం నల్గొండ జిల్లాలో జరిగింది. శనివారం తెల్లవారుజామున చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఇన్నోవా.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
భారీగా ట్రాఫిక్ జామ్: ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఇంజిన్‌లో మంటలు చాలా ఎక్కువ చెలరేగాయి. దీంతో ఇన్నోవా పూర్తిగా దగ్ధమైంది. హైవేపై అడ్డంగా వాహనం బోల్తా పడటంతో హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పక్కకు తీసి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరం: గత కొంత కాలంగా తెలుగు ప్రజలు ప్రయాణం అంటేనే జంకుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిష్కారాలను చూపాలని కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అవసరమైన చర్యలను చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. వివిధ అవసరాల నిమిత్తం రహదారులపై నిలిపి ఉంచే వెహికల్స్‌ను వెంటనే తొలగించేలా చూడాలని కోరుతున్నారు. నిలిపి ఉన్న వాహనాల వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా వాహనదారులకు పోలీసులు సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నారు. వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.


