Vijayawada highway: సంక్రాంతి పండుగ వేళ విజయవాడ హైవేపై విషాదం నెలకొంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ.. విధి నిర్వహణలో పోలీస్ కానిస్టేబుల్ కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది.
కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద విషాదం ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కానిస్టేబుల్ కోల నరేశ్‌కుమార్ (38) మృతి చెందారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న నరేశ్‌కుమార్.. సోమవారం రాత్రి మరో కానిస్టేబుల్ భరద్వాజ్‌తో కలిసి బైక్‌పై హైవే పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. సంక్రాంతి నేపథ్యంలో విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా ఉండటంతో.. ట్రాఫిక్ జామ్ కాకుండా వీరు గస్తీ నిర్వహిస్తున్నారు.తెల్లవారుజామున 3 గంటల సమయంలో ధర్మోజీగూడెం వద్ద భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కొన్ని వాహనాలు నిలిపి ఉంచడాన్ని నరేశ్ గమనించారు. ఆ వాహనాలను అక్కడి నుంచి తీయించాలని డ్రైవర్లకు చెప్పేందుకు ఆయన రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఆయన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నరేశ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
కుటుంబంలో తీరని లోటు: మృతుడు నరేశ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పండుగ పూట తండ్రి తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబంలో ఈ వార్త తీరని శోకాన్ని నింపింది. విధి పట్ల అత్యంత నిబద్ధతతో పనిచేసే వ్యక్తిని కోల్పోయామని తోటి సిబ్బంది కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

