ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఒక మహిళ తన భర్త జననాంగాలను కోసేసింది. తీవ్రంగా గాయపడిన భర్తను ఆసుపత్రిలో చేర్పించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితురాలైన భార్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఈ ఘటన శనివారం రాత్రి జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫసన్‌గంజ్ కచ్‌నావ్ గ్రామంలో జరిగింది. అన్సర్ అహ్మద్ (38) అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వారి పేర్లు సబేజూల్, నజ్నీన్ బానో. ఇద్దరు భార్యలతోనూ అతడికి సంతానం లేదు. ఈ క్రమంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి అన్సర్, అతని రెండో భార్య నజ్నీన్ బానో మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంతో నజ్నీన్ బానో కత్తితో అన్సర్ జననాంగాలను కోసేసింది.
రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అన్సర్‌ను కుటుంబ సభ్యులు వెంటనే జగదీష్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం రాయ్‌బరేలీలోని ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. అన్సర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజ్నీన్ బానోను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.


