Jharkhand: జార్ఖండ్‌లోని గిరిడీ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పానీపూరి తిన్న ఓ ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. మరో 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముసాఫిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.
అసలేం జరిగిందంటే?: స్థానిక వీధి వ్యాపారి వద్ద పానీపూరి తిన్న కొద్దిసేపటికే సుమారు 20 మందికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారందరినీ వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ చికిత్స పొందుతూ ఓ చిన్నారి మరణించింది. మిగిలిన 19 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం మహిళలు, చిన్న పిల్లలే ఉండటం గమనార్హం.
Also read-Nighty: నైటీ ధరించిన భార్య.. కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!
పానీపూరి వ్యాపారి పరార్: ఈ ఘటనపై సమాచారం అందుకున్న సదర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితులంతా ఫుడ్ పాయిజన్(Food Poisoning) కు గురైనట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సదరు పానీపూరి వ్యాపారి అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఆహార భద్రతపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

