Harassment allegations against Swami Chaitanya: స్వామి చైతన్యానందపై విద్యార్థినులు చేసిన లైంగిక ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసభ్య పదజాలంతో దూషిస్తూ, లైంగికంగా వేధించాడని 17 మంది విద్యార్థినులు అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన విచారణ చేపట్టినట్లుగా దిల్లీ పోలీసులు తెలిపారు.
ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే: దిల్లీలోని శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి(స్వామి పార్థసారథి)పై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు చేశారు. ఆ విద్యార్థులంతా ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందినవారు కావడంతో.. ఉపకార వేతనాలతో ఈ విద్యాసంస్థలో చదువుకుంటున్నారు. వారితో అసభ్యం పదజాలాన్ని వాడుతూ దుర్భాషలాడటం, సందేశాలు పంపడమే కాకుండా.. లైంగికంగా వేధింపులకు గురిచేశాడని విద్యార్థినులు తెలిపారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఇతర మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే.. తమను నిందితుడికి పరిచయం చేశారని వాపోయారు. ఈ అంశంపై దిల్లీ పోలీసులు స్పందించారు. 32 మంది విద్యార్థుల్లో 17 మంది తమ వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా తాము కేసు నమోదు చేశామని పోలీసు ఉన్నతాధికారి అమిత్ గోయల్ వెల్లడించారు.
నకిలీ నంబర్ ప్లేట్‌ను గుర్తించిన పోలీసులు: ఈ వ్యవహారంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సైతం విశ్లేషించారు. నిందితుడు ఉండే ప్రాంతంతో సహా బాధితులు పేర్కొన్న స్థలాల్లో తనిఖీలు చేపట్టినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతడి చివరి లొకేషన్‌ను ఆగ్రా సమీపంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.. అలాగే విద్యాసంస్థకు చెందిన బేస్‌మెంట్‌లో ఉన్న ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దానికి ఉన్నది నకిలీ నంబర్ ప్లేట్ అని పోలీసులు వెల్లడించారు.
డైరెక్టర్ పదవి నుంచి తొలగింపు: ఒడిశాకు చెందిన ఈ బాబా గత 12 ఏళ్లుగా దిల్లీలోని ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే ఆయనపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2009లో కూడా అతడిపై లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఒక మహిళ కూడా ఈతరహా అంశంలోనే అతడిపై వేధింపుల కేసు పెట్టారు. అయితే తాజా ఆరోపణల నేపథ్యంలో శ్రీ శృంగేరీ మఠం పాలకమండలి అతడిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. అతడితో అన్ని సంబంధాలను తెంచుకున్నట్లుగా మఠం పేర్కొంది.


