Son Kills Mother Proddatur: నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని కనికరం లేకుండా కడతేర్చాడు ఓ కొడుకు. బిడ్డ ఒంటిపై చిన్న గాయం కనిపించినా తల్లడిల్లే తల్లిని గొంతుకోసి రక్తపు మడుగులో పడేశాడు. అడ్డొచ్చిన కన్న తండ్రిని గదిలో బంధించి నరరూప రాక్షసుడిగా మారాడు. ఈ హృదయ విదారక ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/crime-news/road-accident-at-chityal-on-vijayawada-hyderabad-highway/
మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. స్వార్థపూరిత మనస్తత్వంతో రక్త సంబధాలను కడతేరుస్తున్నారు. డబ్బులివ్వలేదనే కోపంతో కన్న తల్లినే దారుణంగా హతమార్చిన ఘటన ఇందుకు నిదర్శనం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్‌లో ఉప్పలూరు లక్ష్మీదేవి, విజయ్ భాస్కర్ రెడ్డి దంపతులకు కుమారుడు యశ్వంత్ కుమార్ రెడ్డి ఉన్నాడు. తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్.. ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు.
Also Read: https://teluguprabha.net/telangana-news/plan-b-for-tg-local-body-elections/
కాగా, ఖర్చుల కోసం ప్రతి నెలా యశ్వంత్‌కి తల్లి డబ్బులు పంపించేది. ఇటీవల యశ్వంత్‌కి తల్లి రూ. 3వేలు పంపించింది. మరోసారి ఫోన్ చేసి రూ. 10 వేలు కావాలని అడగడంతో తల్లి ఇవ్వలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న కొడుకు.. ఆదివారం ఉదయం ఇంట్లో వారికి చెప్పకుండా హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకి వచ్చాడు. వచ్చీ రాగానే లక్ష్మీదేవితో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం దాడి చేయడంతో ఆమె గట్టిగా అరిచింది. గదిలో ఉన్న తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డికి కేకలు వినపడటంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. గదిలోకి నెట్టేసి తలుపులు వేశాడు.
అనంతరం కూరగాయల కత్తితో తల్లి గొంతు కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న తల్లిని బయటకు ఈడ్చుకొచ్చి పడేశాడు. ఆ తర్వాత ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా తలుపు వేసుకుని దర్జాగా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగా లేదని సమాచారం.


