Son Shoots Father Dead Over Tempo Seat Dispute: దేశ రాజధాని దిల్లీలో ఓ హృదయవిదారక ఘటన సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఉత్తర దిల్లీలోని తిమార్‌పూర్‌లో టెంపోలో ముందు సీటు కోసం తండ్రి-కొడుకుల మధ్య చెలరేగిన చిన్న వాగ్వాదం హత్యకు దారితీసింది. కన్నతండ్రిని కొడుకు తుపాకీతో కాల్చి చంపిన ఈ సంఘటన కుటుంబ బంధాల బలహీనతను, క్షణికావేశపు వినాశకర పరిణామాలను మరోసారి కళ్ళకు కట్టింది.
అసలేం జరిగింది..?
ఉత్తర దిల్లీలోని తిమార్‌పూర్, ఎంఎస్ బ్లాక్ వద్ద జూన్ 27, 2025 గురువారం సాయంత్రం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సురేంద్ర సింగ్ (60) అనే వ్యక్తి తన కుమారుడు దీపక్ (26) చేతిలో హత్యకు గురయ్యారు.
సురేంద్ర సింగ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం దిల్లీ నుంచి తమ స్వస్థలమైన ఉత్తరాఖండ్‌కు తరలివెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో సామాన్లు తరలించడానికి ఒక టెంపోను అద్దెకు తీసుకున్నారు. సామాన్లు టెంపోలో ఎక్కిస్తున్న సమయంలో, టెంపోలో ఒకే ఒక్క ప్రయాణీకుల సీటు అందుబాటులో ఉంది. సీటు ఎవరికి అనే విషయంలో సురేంద్ర సింగ్, ఆయన కుమారుడు దీపక్ మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. సామాన్ల వల్ల ఇబ్బంది కలగకుండా తాను ముందు సీట్లో కూర్చుంటానని తండ్రి సురేంద్ర సింగ్ పట్టుబట్టారు. దీంతో దీపక్ తీవ్ర కోపంతో ఊగిపోయాడు.ఆవేశంతో దీపక్, తన తండ్రి సురేంద్ర సింగ్ తుపాకీని తీసుకుని..తండ్రిపై కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
పోలీసుల తక్షణ చర్య:
ఈ ఘటన జరిగిన సమయంలో సమీపంలో పెట్రోలింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నితిన్ తుపాకీ శబ్దం విని ఘటన స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే స్థానికులు దీపక్ నుంచి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి దీపక్‌నుఅదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన లైసెన్స్‌డ్ తుపాకీతో పాటు, 11 తుటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సురేంద్ర సింగ్‌ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీపక్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.