Student shoots teacher in school : గురువు కొట్టిన చెంపదెబ్బను అవమానంగా భావించాడు. ఆ అవమాన భారం పగగా మారింది. ఆ పగ ప్రతీకారేచ్ఛకు దారితీసింది. పాఠశాలకు పుస్తకాలతో పాటు టిఫిన్ బాక్సులో తుపాకీని కూడా తెచ్చాడు. ఇంతకీ ఆ విద్యార్థి ఏం చేశాడు..? తరగతి గదిలో జరిగిన ఓ చిన్న సంఘటన, కాల్పుల వరకు ఎందుకు దారితీసింది..?
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా, కాశీపుర్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా విద్యాసంస్థల భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఓ విద్యార్థి తన ఫిజిక్స్ టీచర్ గగన్‌దీప్ సింగ్‌పై నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
తరగతి గదిలో చెంపదెబ్బ: కాశీపుర్ ఎస్పీ అభయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఫిజిక్స్ క్లాస్ జరుగుతుండగా, ఉపాధ్యాయుడు గగన్‌దీప్ సింగ్ ఓ విద్యార్థిని ప్రశ్న అడిగారు. అతను సమాధానం చెప్పినప్పటికీ, సంతృప్తి చెందని ఉపాధ్యాయుడు అందరి ముందు ఆ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టారు.
పగతో రగిలిపోయిన విద్యార్థి: నలుగురిలో తనను కొట్టడాన్ని ఆ విద్యార్థి తీవ్ర అవమానంగా భావించాడు. ఉపాధ్యాయుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
టిఫిన్ బాక్సులో తుపాకీ: బుధవారం ఉదయం, ఇంట్లోని అల్మారాలో ఉన్న తన తండ్రి తుపాకీని దొంగిలించి, దాన్ని టిఫిన్ బాక్సులో పెట్టుకుని పాఠశాలకు వచ్చాడు.
కాల్పులతో కలకలం: ఫిజిక్స్ క్లాస్ ముగిసిన తర్వాత, గగన్‌దీప్ సింగ్ గది నుంచి బయటకు వస్తుండగా, ఆ విద్యార్థి టిఫిన్ బాక్సులోంచి తుపాకీ తీసి ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, ఇతర ఉపాధ్యాయులు అతడిని పట్టుకున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉపాధ్యాయుడు : కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గగన్‌దీప్ సింగ్‌ను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన మెడలోకి బుల్లెట్ దూసుకుపోయిందని, శస్త్రచికిత్స చేసి దానిని తొలగించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
నిందితుడి నేపథ్యం, పోలీసుల దర్యాప్తు : మైనర్ అయిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి తండ్రి ఓ రైతు అని, అతనిపై గతంలో హత్యాయత్నం, యాక్సిడెంట్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అతను పరారైనా, తర్వాత తిరిగి రావడంతో ఇంట్లోకి తుపాకీ ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం పాఠశాలలో ఆధారాలు సేకరించి, తుపాకీని స్వాధీనం చేసుకుంది.
ఈ ఘటనతో కాశీపుర్‌లోని పాఠశాలల యాజమాన్యాలు ఉలిక్కిపడ్డాయి. గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించి, అత్యవసర సమావేశం నిర్వహించాయి. పాఠశాలల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.


