పాకిస్థాన్ లో శాంతి భద్రతలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు ఆత్మాహుతి దాడులు ఇక్కడ రొటీన్ గా మారాయి. నిత్యం మారణ హోమంతో రగులుతున్న పాక్ లో సైనికులు, పోలీసులపై స్థానికులు, ఇతర ఉగ్రవాద సంస్థలు కత్తి గట్టాయి. దీంతో విధులు నిర్వహించాలంటే ఖాకీలు, సైనికులు బెంబేలెత్తి పోతున్నారు. వీరంతా తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలకు దిగారు. అయినా వీరికి ఆపన్న హస్తం ఇచ్చేవారే పాక్ లో దిక్కులేకుండా పోయింది.
పెషావర్ మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన వందలాది సైనికులు, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలనే లక్ష్యంగా చేసుకున్న తాలిబన్ ఆత్మాహుతి దాడిలో సుమారు 100 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అయితే దాడి చేసేందుకు వచ్చిన సుసైడ్ బాంబర్ ఏకంగా పోలీసు యూనిఫాంలోనే వచ్చి వారినే హతమార్చాడనే విషయం షాకింగ్ గా మారింది.
మసీదులో 400 మందికి పైగా ప్రార్థనలు చేస్తుండగా తొలి వరుసల్లో ఉన్న బాంబర్ తనను తాను పేల్చుకుని 100 మందికిపైగా పోలీసుల ప్రాణాలు తీశాడు. ఈ దాడిలో ఒక ఇమామ్ మరణించగా.. 150 మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో ఉన్నారు.