Anakapalle Crime:అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు తమిళనాడులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. చెన్నైలోని కోయంబేడులో ఒక భవనంపై నుంచి పడి నవీన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబసభ్యులు ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు.
యువతితో నవీన్ ప్రేమాయణం: అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన నవీన్ అనే యువకుడు బుధవారం సాయంత్రం చెన్నై కోయంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి చెందాడు. గురువారం ఉదయం చెన్నై పోలీసులు నవీన్ కుటుంబానికి ఈ విషయం తెలియజేశారు. అయితే, నవీన్‌ది ఆత్మహత్య కాదని, అతడిని హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు బలంగా అనుమానిస్తున్నారు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని పేర్కొంటున్నారు. రాంబిల్లి మండలం వెంకటాపురంకు చెందిన ఒక యువతితో నవీన్ ప్రేమాయణం సాగిస్తున్నాడని, ఆ యువతి కుటుంబసభ్యులపై తమకు అనుమానం ఉందని నవీన్ కుటుంబం ఆరోపించింది.
కుటుంబ సభ్యుల ఆరోపణలు: నవీన్ ఈ నెల 8న స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌కు వెళ్తున్నానని కుటుంబంతో చెప్పిన అంశాన్ని.. మృతుడి పెదనాన్న వెంకట్రావు మీడియాకు తెలిపారు. నవీన్ ప్రయాణించిన రైల్లో ఆ యువతి, ఆమె తల్లి పేర్లు సైతం ఉన్నాయని అన్నారు. వారు అనకాపల్లి-విజయవాడ మీదుగా రైలులో అరుణాచలం వెళ్లారని తెలిపారు. వారంతా ఒకే చోట ఉన్నట్లుగా అనుమానం ఉందని అన్నారు. నవీన్ మొబైల్ ఫోన్ కూడా ధ్వంసమైన విషయాన్ని మృతుడి పెదనాన్న వెంకట్రావు తెలిపారు. ఇది పథకం ప్రకారం జరిపిన హత్యగా అనుమానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తమకు న్యాయం కావాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:https://teluguprabha.net/crime-news/husband-dies-after-wife-passes-away-in-jagitial-district/
మేనమామ కంటతడి: మరణానికి కారణం తెలియాలని నవీన్ మేనమామ కంటతడి పెట్టాడు. ఒకవేళ ఆత్మహత్య అయితే ఎందుకు చేసుకున్నాడనే వివరాలు పోలీసులు తెలపాలని కోరాడు. ఒకవేళ హత్య అయితే నిందితులు ఎవరనేది తేలాలని డిమాండ్ చేశాడు. మాకు న్యాయం జరగాల పోలీసులను కోరారు.
పోలీసుల విచారణ: ప్రస్తుతం కోయంబేడు పోలీసులు అనుమానాస్పద మృతి కింద.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. చెట్టంత కొడుకు మృతితో.. నవీన్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ కేసులో పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.


