Man Dies Inside Police Station: దాదాపు ఆరు గంటల తర్వాత పోలీసు స్టేషన్ లోపల ఒక వ్యక్తి మృతదేహం లభించడం తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. కోయంబత్తూరులోని బజార్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అరవోళిరాజన్ (60) అనే వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, స్టేషన్‌లో ఉన్న ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ గది తలుపులు లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో, బుధవారం ఉదయం ఆరు గంటల తర్వాత పోలీసులు గమనించి తలుపులు పగలగొట్టగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..
అరవోళిరాజన్ (60) అనే వ్యక్తి మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. “నన్ను 60 మంది వెంబడిస్తున్నారు, నన్ను రక్షించండి” అంటూ ఆందోళనగా పదే పదే చెప్పాడు. మానసికంగా కలత చెందినట్లు కనిపించిన అతడిని, మరుసటి రోజు ఉదయం రావాలని డ్యూటీలో ఉన్న సెంటి సూచించాడు. కానీ, ఆ సెంటి ఫోన్ మాట్లాడటానికి పక్కకు వెళ్లగానే, అరవోళిరాజన్ వేగంగా స్టేషన్‌లోని ఓ ఖాళీ గదిలోకి వెళ్లి, లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. అది ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ గది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
బుధవారం ఉదయం ఆ గది తలుపులు గడియ పెట్టి ఉండటాన్ని గమనించిన పోలీసులు అనుమానంతో తలుపులు బద్దలు కొట్టగా, లోపల సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న అరవోళిరాజన్ మృతదేహం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అసలు విషయం బయటపడింది. ఆ వృద్ధుడు తన ధోతీతోనే ఉరివేసుకొని చనిపోయాడు.
శాంతిభద్రతలపై ఆందోళన..
ఈ ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక పోలీస్ స్టేషన్ లోపలే ఆత్మహత్య జరిగిందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే పలు కస్టడీ మరణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ప్రభుత్వానికి ఇది మరో సవాలుగా మారింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా, రాష్ట్రంలో పెరుగుతున్న ఈ తరహా ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అరవోళిరాజన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు. ఈ దారుణం వెనుక ఉన్న అసలు కారణాలపై విచారణ జరుగుతోంది.


