Techie’s Suicide in Bengaluru: బెంగళూరులో ఓ మహిళా టెకీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సౌత్ బెంగళూరులోని సుద్దగుంటెపాళ్యలో నివాసముంటున్న శిల్ప అనే 27 ఏళ్ల మహిళ మంగళవారం రాత్రి తన ఇంట్లోనే ఉరేసుకుని కనిపించింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపులు, భర్త, అత్తమామల మానసిక వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
శిల్పకు, ఆమె భర్త ప్రవీణ్‌కి పెళ్లై రెండున్నరేళ్లు అయింది. వారికి ఒకటిన్నర సంవత్సరాల బాబు ఉన్నాడు. శిల్ప ఇంఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేది. ఆమె భర్త ప్రవీణ్ కూడా మొదట్లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసి, ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆహార వ్యాపారం మొదలుపెట్టాడు.
అడిగినంత కట్నం ఇచ్చినా ఆగని వేధింపులు..
పెళ్లి సమయంలో ప్రవీణ్ కుటుంబం రూ. 15 లక్షల నగదు, 150 గ్రాముల బంగారం, గృహోపకరణాలు డిమాండ్ చేశారని, అన్నీ ఇచ్చినా కూడా అదనంగా డబ్బు కోసం తన కూతురును వేధించారని శిల్ప కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా, చర్మం రంగు నల్లగా ఉందని శిల్పను అత్తమామలు తరచుగా వేధించారని, “నీవు నల్లగా ఉంటావు, మా అబ్బాయికి తగిన దానివి కాదు, అతన్ని వదిలేయ్, మేము మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము” అని అత్తమామలు వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆరు నెలల క్రితం, ప్రవీణ్ వ్యాపారం కోసం అదనంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేయగా, శిల్ప కుటుంబం ఆ డబ్బును కూడా ఇచ్చింది. అయినా వేధింపులు ఆగకపోవడంతోనే శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. సుద్దగుంటెపాళ్య పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత శిల్ప మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు.


