NTR District Road Accident: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా సమీపంలో బీఎండబ్ల్యూ కారుపై భారీ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణికులు ఉండగా.. వాహనం నుజ్జునుజ్జయింది. టోల్‌ప్లాజా దాటుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనలో అడ్వకేట్ బొద్దులూరి శ్రీనివాసరావు(65) మృతి చెందారు. శ్రీనివాసరావు తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పోలీసులు గుర్తించారు.
కీసర టోల్ గేట్ వద్ద ఆగిన సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఫ్లయి యాష్ ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో బీఎండబ్ల్యూ కారుపై పడి నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్లు, జేసీబీ సాయంతో కారుపై పడిన సిమెంట్ ట్యాంకర్‌ను తొలగించారు. ప్రమాదానికి గురైన కారు నెంబరు టీఎస్ 09 ఎఫ్‌టీ 6662. కారు యజమాని శ్రీనివాసరావు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో మరికొందరికి గాయాలు కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

