Bus accident at Palnadu district : ఏపీలోని పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీశైలం వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఘటన వివరాలు: శనివారం ఉదయం రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు శ్రీశైలం వెళ్తుండగా ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు అదుపుతప్పి రోడ్డు దిగువకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రయాణికులకు స్వల్ప గాయాలు: ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను స్థానికుల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


