Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుRobbery: వ్యాపారిని వెంబడించి రూ. 40 లక్షలు చోరీ.. పారిపోతుండగా దుండగులకు షాక్‌.!

Robbery: వ్యాపారిని వెంబడించి రూ. 40 లక్షలు చోరీ.. పారిపోతుండగా దుండగులకు షాక్‌.!

Rs. 40 lakhs looted at Shankarpally: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలో పట్టపగలే సినీ ఫక్కీలో దారి దోపిడీ సంఘటన కలకలం రేపింది. ఓ స్టీల్‌ వ్యాపారి రూ. 40 లక్షలను తీసుకెళ్తున్నాడనే సమాచారంతో ఆయన కారును పలువురు దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడమే కాకుండా, ఆయన కళ్లలో కారం జల్లి డబ్బులు తీసుకుని పారిపోయారు. ఈ క్రమంలోనే వారికి ఊహించని షాక్‌ తగిలింది.

- Advertisement -

సినిమాల్లో చూపించే దారి దోపిడీ సంఘటనలు ప్రేక్షకులను ఉత్సుకతను, ఆసక్తిని కలిగిస్తాయి. కానీ నిజ జీవితంలో అలాంటి సంఘటనలు జరిగితే భయాందోళనలను కలిగిస్తాయి. తాజాగా శంకర్‌పల్లిలో పట్టపగలే జరిగిన దారి దోపిడీ.. బాధితుడికి ముచ్చెమటలు పట్టించింది. కానీ ఆ కాసేపటికే దుండగులు ఖంగు తినే సంఘటన చోటుచేసుకుంది.

Also Read: https://teluguprabha.net/viral/school-girl-falls-into-open-manhole-in-hyderabad/

శుక్రవారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఓ స్టీల్‌ వ్యాపారి రూ. 40 లక్షలు నగదు తీసుకుని తన ఫోర్డ్‌ ఫిగో కారులో వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు దుండగులు స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో వ్యాపారిని వెంబడించారు. ముందు వెళ్తున్న వ్యాపారి కారును ఢీకొట్టగా.. అప్పుడు ఆయన కారు ఆగిపోయింది. వెంటనే రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. అనంతరం వ్యాపారి కళ్లలో కారం కొట్టి బొమ్మ తుపాకీతో బెదిరించారు. కారులోని రూ. 40 లక్షల నగదు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఇక దుండగులు ఊపిరి పీల్చుకుని సంతోషంతో డబ్బు తీసుకుని పారిపోతుండగా గుర్తించిన స్థానికులు వారి కారును వెంబడించారు. ఈ క్రమంలో నిందితులు ప్రయాణిస్తున్న కారు శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో బోల్తా పడింది. స్థానికులు వెంబడించడాన్ని గుర్తించిన దుండగులు.. వెంటనే తమ కారును, సామగ్రిని వదిలేసి అందినకాడికి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. 

Also Read: https://teluguprabha.net/crime-news/iti-student-suicide-at-hathnikund-barrage-in-uttarapradesh-video-viral/

స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు, బొమ్మ తుపాకీ, కత్తి, కారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. కారు నంబర్‌, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దుండగులు ఎవరు, ఎందుకు దోపిడీ చేశారనే వివరాలపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad