కామాపేక్ష లేని పెదాల స్పర్శను నేరంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు (Delhi Court) స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చిన్నతనంలో తల్లి వదిలేయడంతో ఓ బాలిక శిశు సంరక్షణ కేంద్రంలో పెరిగింది. 12 ఏళ్ల వయసులో తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లింది. అక్కడామెతో సమీప బంధువు ఒకరు ఇబ్బందికరంగా ప్రవర్తించినట్టు పోక్సో కేసు నమోదైంది.
ఈ కేసును సవాల్ చేస్తూ నిందితుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్ట నిబంధనల ప్రకారం కామాపేక్ష లేని పెదాల స్పర్శను నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. శరీరాన్ని తాకడాన్ని, బాలిక సమీపంలో నిద్రించడాన్ని లైంగికదాడిగా పేర్కొంటూ ఈ చట్టం కింద విచారణ జరపలేమని జస్టిస్ స్వరణ కాంత శర్మ పేర్కొన్నారు.
బాలిక గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకపోవడం, నిందితుడికి దురుద్దేశాలు ఉన్నట్టు మేజిస్ట్రేట్, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు వెల్లడించకపోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసును కొట్టివేసింది.
అయితే, మహిళలకు తమ శరీరంపై సర్వహక్కులు ఉంటాయని, వారికి ఇష్టం లేకుండా చిన్నగా తాకినా నేరమేనని, కాబట్టి కేసును మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.