ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం (నవంబర్ 29) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఫిరోజాబాద్ జస్రావాలోని ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలిసింది.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 18 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. మృతుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు ఫిరోజాబాద్ ఎస్పీ ఆశిష్ పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. షాప్ లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అన్నవిషయంపై స్పష్టత లేదా అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రవిచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు.