Train reverses to save passenger: రైలు పట్టాలపై ప్రయాణికుల గోడు, గంటల తరబడి నిలిచిపోయిన బోగీలు – భారతీయ రైల్వేల అపవాదులకు ఇవి సజీవ సాక్ష్యాలు. కానీ, ఆ నిందలన్నీ పటా పంచలు చేస్తూ… ప్రకాశం జిల్లాలో మానవత్వం కొత్త రూపం ధరించింది. ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడ్డ ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడేందుకు.. ఏకంగా కిలోమీటరున్నర దూరం రైలును లోకోపైలట్ రివర్స్‌లో నడిపారు. అయినా విధి ఆడిన వింత నాటకంలో వారి శ్రమ ఫలించలేదు.
చేతులు కడుక్కుంటూ జారిపడి: గుంటూరు జిల్లాకు చెందిన కమలకంటి హరిబాబు అనే వ్యక్తి, తన స్నేహితులతో కలిసి పని నిమిత్తం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో యలహంకకు బయలుదేరారు. రైలు ప్రకాశం జిల్లా గజ్జలకొండ స్టేషన్ దాటిన తర్వాత వాష్‌బేసిన్ వద్ద చేతులు కడుక్కునేందుకు వెళ్లిన హరిబాబు ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడిపోయాడు.
చైన్ లాగి, రివర్స్ గేర్ వేసి: ఈ ఘటనను గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై చైన్ లాగి రైలును ఆపేశారు. అప్పటికే రైలు.. ప్రమాదం జరిగిన స్థలం నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్లింది. హరిబాబు స్నేహితులు, ప్రయాణికులు లోకోపైలట్‌కు విషయం వివరించడంతో ఆయన తక్షణమే స్పందించారు.
ఉన్నతాధికారుల అనుమతి: లోకోపైలట్ వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి రైలును వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరారు.
Also Read:https://teluguprabha.net/crime-news/couple-missing-after-fishing-trip-in-joogamba-gadwal/
మానవత్వపు స్పందన: మానవతా దృక్పథంతో స్పందించిన అధికారులు వెంటనే అంగీకరించడంతో లోకోపైలట్ రైలును రివర్స్ గేర్‌లో నెమ్మదిగా వెనక్కి నడిపించారు.
దక్కని ప్రాణం: కిలోమీటరున్నర దూరం వెనక్కి ప్రయాణించి, తీవ్ర గాయాలతో పడి ఉన్న హరిబాబును రైలులోకి ఎక్కించుకున్నారు. తదుపరి స్టేషన్‌లో అతడిని దించి, 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా అప్పటికే హరిబాబు ప్రాణాలు విడిచాడని వారు ధ్రువీకరించారు.
ప్రాణం కాపాడలేకపోయామనే బాధతో: ఒక ప్రయాణికుడి ప్రాణం కోసం నిబంధనలను సైతం పక్కనపెట్టి శ్రమించినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో రైల్వే సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఈ అసాధారణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


