Gang rape in medak district: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మానవత్వాన్ని కలచివేసే అమానుష ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అత్యాచారానికి గురైన గిరిజన మహిళను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఆమె తుదిశ్వాస విడిచారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో దారుణం జరిగింది. పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ నుంచి ఏడుపాయలకు వెళ్లే దారిలో మొదటి వంతెన దాటిన తర్వాత గల.. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అటు వైపు వెళ్తున్న ప్రయాణికులు అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించి.. మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా బాధిత మహిళ మరణించింది. మృతురాలు మెదక్ మండలం జానకంపల్లి గ్రామ సమీపంలోని సంగాయిగూడ తండాకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఆమె భర్త మెదక్ పట్టణంలో అడ్డా కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏడుపాయలకు కూతవేటు దూరంలో దారుణం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు వెళ్లే మార్గంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏడుపాయల ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో పాటుగా.. పోలీసుల నిఘా తక్కువగా ఉండడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.


