Father and Daughter died as rice mill wall collapses: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్షాల కారణంగా గోడ కూలి తండ్రి, కుమార్తె మృతి చెందారు. చిన్నారి తల్లికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు.
రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యమే కారణం: భారీ వర్షాలు తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షాలతో కోటగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ వాడలోని ఓ ఇంటి పక్కన ఉన్న రైస్ మిల్ గోడ కూలింది. ఈ ఘటనలో రేకుల షెడ్డులో నివాసం ఉంటున్న ఇందూరు మహేష్, ఆయన రెండేళ్ల పాప గోడ కింద పడి మృతి చెందారు. చిన్నారి తల్లికి తీవ్ర గాయాలుకావడంతో వెంటనే స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటగిరిలోని ఎస్సీ వాడలో ఇందూర్ మహేష్ కుమార్ చిన్న రేకుల షెడ్డులో తల్లి తండ్రులతో పాటు భార్యాపిల్లలతో నివసిస్తున్నారు. అయితే దాని పక్కనే శిథిలమైన రైస్ మిల్లు ఉంది. దాన్ని తొలగించాలని పలుమార్లు కాలనీవాసులు రైస్ మిల్ యజమానికి చెప్పినప్పటికీ.. ఆయన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజు రెండు ప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికుల కంటతడి: రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు గోడ పూర్తిగా తడిసిపోయి రేకుల షెడ్డుపై కూలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండటంతోనే మహేష్ కుమార్, అతడి భార్యతో పాటుగా రెండేళ్ల చిన్నారి గోడ కింద చిక్కుకుపోయారు. అప్పటికే నిద్ర నుంచి మేల్కొన్న మహేష్ కుమార్ తల్లిదండ్రులు బయట కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి గోడ కింద తండ్రి కూతురు ఇద్దరు అప్పటికే మృతి చెంది ఉన్నారు. ఆయన భార్యకు తీవ్రగాయాలు కావడంతో అతి కష్టం మీద గోడ కింద నుంచి తీసి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు కంటతడి పెట్టారు.


