Eluru accident: ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నిద్రిస్తున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకోవడం ఇద్దరు మహిళలు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగింది.
నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం: ఏలూరు జిల్లా వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిద్రపోతున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇద్దరు మహిళలు సజీవదహనమయ్యారు. మంటల వ్యాప్తి ఎక్కువకావడంతో తప్పించుకునే వీలులేక ఆ మంటలకే ఆహుతయ్యారు.
కేసు నమోదు చేసిన పోలీసులు: మృతిచెందిన వారు వలగాని సావిత్రి (60), సిగ పూలమ్మ (65)గా పోలీసులు గుర్తించారు. పూలమ్మ ఈ మధ్యే తన చెల్లిని చూసేందుకు తెలంగాణలోని సూర్యాపేట జిల్లానుంచి వేలేరుపాడుకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భారీగా ఎగిసి పడుతున్న మంటలను స్థానికులు అదుపు చేసి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

