Honour killing in Uttar Pradesh : సృష్టిలో ఏ బంధానికైనా ఒక స్వార్థం ఉంటుందేమో కానీ, తల్లిదండ్రులు చూపే ప్రేమకు మాత్రం ఎలాంటి షరతులు ఉండవు. కానీ, ‘కంచే చేను మేసిన చందంగా’ ఆ తండ్రికి కన్న పేగు కంటే పరువే ప్రాణంగా అనిపించింది. కూతురు చేసిన చిన్న తప్పును సరిదిద్దాల్సిన వాడే.. ఆమె పాలిట కసాయివాడిగా మారాడు. రక్త సంబంధానికే మాయని మచ్చలా మిగిలిపోయే అత్యంత దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. కన్న కూతురిని పాశవికంగా హతమార్చడమే కాకుండా, దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, తలను చెరువులో పడేసి, మొండాన్ని రైలు పెట్టెలో వదిలేసిన ఆ తండ్రి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
దశలవారీగా దర్యాప్తు.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే వాస్తవాలు
కులం చిచ్చు.. కసాయిగా మారిన కన్న తండ్రి : ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ ప్రాంతానికి చెందిన బిగ్గన్ అన్సారీ గతంలో ఐదేళ్ల పాటు విదేశాల్లో పనిచేశాడు. ప్రస్తుతం స్వగ్రామానికి తిరిగి వచ్చి ఈ-రిక్షా నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి చిన్న కుమార్తె ఈ మధ్య ఓ యువకుడితో తరుచూ ఫోన్‌లో మాట్లాడుతుండేది. ఆ యువకుడు వేరే కులానికి చెందినవాడు కావడం, అతడినే తన కూతురు పెళ్లి చేసుకుంటుందేమోనన్న అనుమానం అన్సారీ మనసులో బలంగా నాటుకుపోయింది. కూతురిని మందలించినప్పటికీ ఆమె వినకపోవడంతో, పరువు కోసం కన్న బిడ్డనే బలితీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కిరాతకానికి తన సోదరి నూర్జహాన్, బావ మొజిబుల్లా అన్సారీలను తోడుగా చేసుకుని పక్కా స్కెచ్ గీశాడు.
పథకం ప్రకారం హత్య.. ముక్కలుగా మృతదేహం : హత్య చేయడానికి ముందు, ఇంట్లో ఎవరూ ఉండకూడదని భావించిన అన్సారీ తన భార్యాపిల్లలను ఉద్దేశపూర్వకంగా వేరే చోటికి పంపించాడు. ఆ తర్వాత సోదరి, బావతో కలిసి కూతురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. దొరికిపోకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. తలను గ్రామానికి సమీపంలోని ఓ చెరువులో పడేసి, కాళ్లు, చేతులను వేర్వేరు పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి, మొండాన్ని ఒక పెట్టెలో (ట్రంక్ బాక్స్) కుక్కాడు. రక్తం మరకలు బయటకు రాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకున్నాడు. తన ఈ-రిక్షాలోనే ఆ పెట్టెను రైల్వే స్టేషన్‌కు తరలించాడు.
Also Read: https://teluguprabha.net/national-news/sara-tendulkar-angry-on-body-shaming-post/
రైలులో మొండెం.. సీసీటీవీల ద్వారా ఛేదింపు : మే 17వ తేదీన ఛప్రా-గోమతి నగర్ ఎక్స్‌ప్రెస్ (ఎస్-1 కోచ్) రైలును శుభ్రం చేస్తున్న క్లీనింగ్ సిబ్బందికి.. ఒక సీటు కింద అనుమానాస్పదంగా ఉన్న పెట్టె, దాని పైన ఒక సంచి కనిపించాయి. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి తెరిచి చూసి అవాక్కయ్యారు. అందులో బాలిక మొండెం, శరీర భాగాలు లభ్యమయ్యాయి.
ఈ మిస్టరీని ఛేదించడానికి రైల్వే ఎస్పీ (GRP SP) రోహిత్ మిశ్రా వెంటనే మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా రైలు ప్రయాణించిన మార్గంలోని దాదాపు 800 సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. కుషినగర్ జిల్లాలోని తమ్కుహి రోడ్ రైల్వే స్టేషన్‌లో కీలకమైన ఫుటేజీ లభ్యమైంది. ఇద్దరు పురుషులు, ఒక మహిళ కలిసి ఆ పెట్టెను ఎస్-1 కోచ్‌లో పెట్టి, మరో బోగీలో నుంచి దిగి వెళ్లడం పోలీసులు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు కక్కారు.
సాక్ష్యాల సేకరణ.. కటకటాల వెనక్కి నిందితులు : నిందితుడు అన్సారీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, బుధవారం నాడు జీఆర్పీ మరియు స్థానిక పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక తలను, హత్యకు ఉపయోగించిన మారణాయుధాన్ని చెరువులోంచి వెలికితీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తండ్రి అన్సారీతో పాటు అతడికి సహకరించిన సోదరి, బావలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

