Wife burns husband alive in UP : పవిత్రమైన వివాహ బంధానికే మచ్చతెచ్చేలా, కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ కఠినాత్మురాలు. ప్రియుడి మోజులో పడి, మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. భక్తిశ్రద్ధలతో కావడి యాత్రకు వెళ్లిన భర్తను అడ్డగించి, పెట్రోల్ పోసి నిలువునా దహనం చేసిన ఈ పాశవిక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో చోటుచేసుకుంది.
బాగ్‌పత్ జిల్లా కందేరా గ్రామానికి చెందిన వేద్‌పాల్ కుమారుడు సన్నీకి, సమీపంలోని గర్హీ కంగరాన్ గ్రామానికి చెందిన అంకితతో గతేడాది వివాహమైంది. కాపురం సజావుగా సాగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలోనే ఈ ఘోరం వెలుగుచూసింది. అంకితకు అయ్యూబ్ అహ్మద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే భర్త సన్నీని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ నెల 22వ తేదీన, సన్నీ పవిత్రమైన కావడి యాత్రలో భాగంగా గంగా జలాన్ని తీసుకురావడానికి తన బైక్‌పై హరిద్వార్‌కు బయలుదేరాడు. ఇదే అదునుగా భావించిన నిందితులు, తమ పన్నాగాన్ని అమలు చేశారు. కంగరాన్ గ్రామ సమీపంలోని రహదారిపై సన్నీని అడ్డగించారు. భార్య అంకిత, ఆమె ప్రియుడు అయ్యూబ్ అహ్మద్, అంకిత మామ సుశీల్, బేబీ అనే మరో వ్యక్తి కలిసి సన్నీపై దాడికి తెగబడ్డారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీని, నిందితులు బలవంతంగా అంకిత పుట్టింటికి తీసుకెళ్లారు. అక్కడ, అత్యంత పాశవికంగా అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతూ సన్నీ పెట్టిన ఆర్తనాదాలు ఆ దుర్మార్గుల మనసును కరిగించలేకపోయాయి. తీవ్రంగా గాయపడిన అతడిని మొదట మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అక్కడి వైద్యులు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ కొన్ని రోజులు మృత్యువుతో పోరాడిన సన్నీ, చివరకు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
మృతుడి తండ్రి వేద్‌పాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు అంకిత, ఆమె ప్రియుడు అయ్యూబ్, సుశీల్ మరియు బేబీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం. దీంతో ఆగ్రహించిన కందేరా గ్రామస్థులు, నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ నిరసనకు దిగారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


