UP Woman Jumps into Canal with 3 Children: ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్తతో గొడవపడిన ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వీరి మృతదేహాలు ఒకే బట్టతో కట్టబడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన బందా జిల్లాలోని రిసౌరా గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెలితే..
మృతులను రీనా (30), ఆమె పిల్లలు హిమాన్షు (9), అన్షీ (5), ప్రిన్స్ (3)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి రీనా తన భర్త అఖిలేష్‌తో కుటుంబ విషయాలపై గొడవపడింది. గొడవ తర్వాత కోపంతో తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం రీనాతో పాటు పిల్లలు కనిపించకపోవడంతో అఖిలేష్ కుటుంబ సభ్యులు వారి కోసం వెతకడం ప్రారంభించారు.
వారు వెతుకుతూ కాలువ గట్టు వద్దకు వెళ్ళగా, అక్కడ వారి దుస్తులు, చెప్పులు, గాజులు, ఇతర వస్తువులు కనిపించాయి. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాలువలో గజ ఈతగాళ్లను దించారు. సుమారు ఐదు నుంచి ఆరు గంటల గాలింపు చర్యల అనంతరం, రీనా, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే, ఆ మృతదేహాలు ఒకే క్లాత్‌తో కట్టబడి ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శివరాజ్ మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తర్వాతే రీనా ఈ దారుణానికి ఒడిగట్టిందని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం రీనా భర్త అఖిలేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన తెలిపారు.


