Uttar Pradesh Suicide Case: ఒక నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. గుండెకోతతో ఓ కుటుంబం విలవిలలాడుతోంది. కానీ, అతడి చావుకు ముందు రాసిన వాంగ్మూలం ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు వ్యవస్థను కుదిపేస్తోంది. ఒంటిపై ఉన్న ప్యాంటునే కాగితంగా మార్చి, తన ఆవేదనను అక్షరాలుగా మలిచి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. అసలేం జరిగింది..? అతడిని అంతలా వేధించిందెవరు..? ఆ ప్యాంటుపై రాసిన చివరి మాటలేంటి..?
ఏం జరిగింది:
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా, మౌదర్వాజా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుటాసి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామ్ రయీస్ కుమారుడైన దిలీప్ కుమార్ (25) సోమవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం, దిలీప్ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. దిలీప్ ధరించిన ప్యాంటుపైనే తన చావుకు గల కారణాలను రాయడం చూసి వారు పోలీసులకు సమాచారం అందించారు.
ప్యాంటుపై ఉన్న ఆవేదన అక్షరాలివే:
దిలీప్ తన చావుకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో తన భార్యతో పాటు ఇద్దరు పోలీసుల పేర్లను ప్రస్తావించాడు. తన భార్య చేసిన ఫిర్యాదు మేరకు హథియాపుర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు యశ్వంత్ యాదవ్, మహేశ్ ఉపాధ్యాయ్ తనపై దాడి చేశారని అతడు ఆరోపించాడు. అంతేకాకుండా, తన నుంచి రూ.50,000 లంచం డిమాండ్ చేశారని, భార్యతో గొడవను పరిష్కరించుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని అందులో పేర్కొన్నాడు.
రంగంలోకి దిగిన అధికారులు:
విషయం తెలుసుకున్న అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ సింగ్ తన బృందంతో ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దిలీప్ రాసిన సూసైడ్ నోట్ ఉన్న ప్యాంట్‌ను స్వాధీనం చేసుకుని, దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి రామ్ రయీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, దిలీప్ మామ బన్వారీ లాల్, బావమరుదులు రాజు, రజనేశ్ రాజ్‌పుత్‌తో పాటు కానిస్టేబుళ్లు యశ్వంత్ యాదవ్, మహేశ్ ఉపాధ్యాయ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను తక్షణమే లైన్ డ్యూటీకి పంపిస్తున్నట్లు ఎస్పీ సంజయ్ సింగ్ ప్రకటించారు.
తండ్రి ఫిర్యాదులో కీలక అంశాలు:
దిలీప్ తండ్రి రామ్ రయీస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. తన కుమారుడికి, కోడలికి మధ్య వివాదం ఉందని, ఈ విషయమై కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. సోమవారం దిలీప్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారని, అక్కడ కానిస్టేబుల్ యశ్వంత్ యాదవ్ రూ.50,000 డిమాండ్ చేశాడని ఆరోపించారు. మరో కానిస్టేబుల్ మహేశ్ ఉపాధ్యాయ్ రూ.40,000 తీసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చాడని, ఆ తర్వాత తీవ్ర మనస్తాపంతో ఇంటికి వచ్చిన దిలీప్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.
కుటుంబ సభ్యుల ఆందోళన:
దిలీప్ మరణంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు, ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్ మేనల్లుడు రాహుల్ రాజ్‌పుత్ ఘటనాస్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
పోలీసుల అధికారిక ప్రకటన:
ఈ ఘటనపై అదనపు ఎస్పీ డాక్టర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, దిలీప్ మరియు అతని భార్య మధ్య గొడవలు ఉన్నాయని, భార్య ఫిర్యాదు మేరకు ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశామని తెలిపారు. “దిలీప్ ఇంటికి వెళ్లిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో తన భార్య కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరు పోలీసుల పేర్లను కూడా ప్రస్తావించాడు. దీని ఆధారంగా ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం,” అని ఆయన స్పష్టం చేశారు.


