HomeTop StoriesRoad Accidents : ఉత్తరప్రదేశ్ రహదారులపై రక్తపాతం: వరుస ప్రమాదాల్లో 17 మంది దుర్మరణం

Road Accidents : ఉత్తరప్రదేశ్ రహదారులపై రక్తపాతం: వరుస ప్రమాదాల్లో 17 మంది దుర్మరణం

Road Accidents in Uttar Pradesh : గమ్యం చేరుతామన్న ఆశలు అర్ధాంతరంగా ఆవిరయ్యాయి. పొట్టచేతపట్టుకుని బతుకుతెరువు కోసం బయలుదేరిన కూలీలను మృత్యుశకటం దారుణంగా కబళించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు నెత్తుటేరులు పారించాయి. ఒకచోట కాదు, రెండు చోట్ల కాదు.. ఏకంగా నాలుగు వేర్వేరు ఘటనల్లో 17 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 

- Advertisement -

లఖీమ్‌పుర్‌ ఖీరీలో మృత్యుఘోష: నుజ్జునుజ్జయిన వ్యాన్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీమ్‌పుర్‌ ఖీరీ జిల్లా ఊంచ్‌ గ్రామంలోని సిసైయా జాతీయ రహదారి (National Highway) సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మృత్యుఒడిలా మారింది. కూలీ పనుల కోసం ఓ టాటా మ్యాజిక్ వాహనంలో 8 మంది పురుషులు, 4 మంది మహిళలు (మొత్తం 12 మందికి పైగా) లఖీమ్‌పుర్‌ ఖీరీకి బయలుదేరారు. మార్గమధ్యంలో అత్యంత వేగంగా వెళ్తున్న వీరి వాహనం అదుపుతప్పి, ముందు వెళ్తున్న భారీ ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad-metro-new-coaches-beml-telangana-govt/

ఢీకొన్న వేగానికి వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి ఇనుప ముద్దలా మారింది. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు అతికష్టం మీద శిథిలాల మధ్య ఇరుక్కున్న మృతదేహాలను వెలికితీశారు. ఈ హృదయవిదారక ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అధికారులను ఆదేశించారు.

బహ్రైచ్, షాజహాన్‌పూర్‌లలోనూ నెత్తుటి మరకలు : మరోవైపు బహ్రైచ్-నేపాల్ రహదారిపై ఆదివారం రాత్రి మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బహ్రైచ్ నగరానికి చెందిన కొందరు కారులో వెళ్తుండగా.. అతివేగంగా దూసుకొచ్చిన కంబైన్ హార్వెస్టర్ యంత్రం వారి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలుకాగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన హార్వెస్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అదేవిధంగా, షాజహాన్‌పూర్‌లోని కాంట్ పట్టణం సమీపంలో జలాలాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒక మహిళ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Also Read: https://teluguprabha.net/telangana/nizamabad-news/leopard-attacks-sama-dubba-thabda-in-kamareddy-district-three-cows-died/

ప్రాణాలు నిలబెట్టిన సమయస్ఫూర్తి : వరుస విషాదాల మధ్య అమేఠీ జిల్లాలో జరిగిన ఓ ఘటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాగ్‌రాజ్ – ఫైజాబాద్ జాతీయ రహదారిపై దుర్గాపూర్ మార్కెట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభించాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. కండక్టర్ సహాయంతో ప్రయాణికులందరినీ కిందకు దించేశాడు. వారు కిందకు దిగిన నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో 35 నిండు ప్రాణాలు సురక్షితంగా బయటపడ్డాయి. అజాగ్రత్త, అతివేగం కారణంగా ఉత్తరప్రదేశ్ రహదారులు ఒకే రోజు ఇన్ని ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News