టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, నిరుద్యోగులు భగ్గుమన్నారు. కేయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై కేయూలో మహాధర్నా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో కేయూ లైబ్రరీ నుంచి రెండో గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వీసీ భవనం వరకు చేరకుని సుమారు గంటపాటు ధర్నా చేశారు. వీసీ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఎంతసేపటికీ వీసీ స్పందించకపోవడంతో విద్యార్థులు భవనం లోపలికి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. విద్యార్థులు ఆగ్రహంతో భవనం కిటికీ అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. ఇద్దరు విద్యార్థులు భవనంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని విద్యార్థులను నిలవరించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేసి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సభకు అనుమతి ఇవ్వకపోవడంతో…
మొదట మార్చి 24న కేయూలో విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సభను మార్చి 29 నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ సభకు కేయూ వీసీ అనుమతి ఇస్తానని చెప్పి, తీరా ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో విద్యార్థి నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతున్నాయంటూ, వారికి భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని 12మంది విద్యార్థి జేఏసీ నాయకులను అరెస్టు చేసి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వీసీ తీరుపై తీవ్ర ఆగ్రహం సభకు అనుమతి ఇవ్వకపోవడంపై కేయూ విద్యార్థి సంఘాల జేఏసీ మండిపడింది. వీసీ తాటికొండ రమేష్ తీరును నాయకులు తీవ్రంగా ఖండించారు. 30 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగుల భరోసా కై సంఘర్షణ సభను నిర్వహించకుంటామంటే ప్రభుత్వానికి తొత్తుగా వ్యవరిస్తూ సభ రద్దు చేసిన వీసీ తాటికొండ రమేష్ విద్యార్థు నిరుద్యోగుల ఆగ్రహం చవిచూస్తారని హెచ్చరించారు.