Woman Sold By In-Laws: కొడుకు, మనవడు చనిపోయారన్న కనికరం కూడా లేకుండా.. కట్టుకున్న కోడలిని అంగడి సరుకులా లక్ష రూపాయలకు పైగా బేరం పెట్టి అమ్మేశారు కసాయి అత్తమామలు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెను ఆదుకోవాల్సింది పోయి, ఆమె జీవితాన్నే నాశనం చేశారు. రెండేళ్ల నరకయాతన తర్వాత బయటపడ్డ ఆ అభాగ్యురాలి కథ కన్నీళ్లు పెట్టిస్తోంది.
అసలేం జరిగింది:
మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా, అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాధితురాలికి కొన్నేళ్ల క్రితం భర్త, ఒక కుమారుడు మరణించారు. అప్పటి నుంచి ఆమె తన మరో కొడుకు, కుమార్తెతో కలిసి అత్తమామల వద్దే ఉంటోంది. అయితే, కోడలు తమకు భారం అనుకున్నారో ఏమో, ఆమెను అమ్మేయడానికి ఆ కర్కోటకులు కుట్ర పన్నారు.అందులో భాగంగా, గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తితో రూ.1,20,000 లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో అడ్వాన్సుగా రూ.80,000 చేతికి అందగానే, కోడలిని అతని వెంట పంపించేశారు.
రెండేళ్ల నరకం.. ఆపై వీధిపాలు:
బాధితురాలిని గుజరాత్‌కు తీసుకెళ్లిన ఆ వ్యక్తి, రెండేళ్ల పాటు ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడు. ఈ క్రమంలో ఆమెకు అతని వల్ల మరో మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత, ఆ కిరాతకుడు ఆమెను ఆమె గ్రామంలోనే వదిలేసి వెళ్లిపోయాడు.
ALSO READ: https://teluguprabha.net/crime-news/father-kills-son-rajasthan-borewell/
మిస్సింగ్ కేసుతో వెలుగులోకి:
ఈ దారుణం అంతా ఎలా బయటపడిందంటే, 2023లో బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తె, మనవడు, మనవరాలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే, గ్రామంలో ఒంటరిగా కనిపించిన బాధితురాలిని గుర్తించి విచారించగా, ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తనను అత్తమామలే అమ్మేశారని, అయితే తన మిగతా ఇద్దరు పిల్లల ఆచూకీ కూడా తెలియడం లేదని, వారిని ఎలాగైనా వెతికించాలని ఆమె పోలీసులను వేడుకోవడం అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది.
“బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె అత్తమామలతో సహా నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశాం,” అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీలేశ్ సురద్కర్ తెలిపారు. బాధితురాలి మిగతా ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


