Wife Kills Husband: ”ఒకరి వెంట ఒకరు అగ్ని చుట్టూ ఏడు అడుగులు నడిచి.. ఆరో ప్రాణంగా ఐదో తనాన్ని మూట గట్టుకుని.. నాలుగు దిక్కులు సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యేది పెళ్లంటే..” అలాంటి గొప్ప చరిత్ర ఉన్న మన వివాహానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తను, ప్రేయసి మోజులో పడి భార్యను చంపేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అయ్యాయి. తాజాగా అలాంటిదే కర్ణాటకలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా చంపింది ఓ ఇల్లాలు. అంతేకాకుండా నేరాన్ని కప్పిపుచ్చేందుకు భర్త బాడీని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసింది.
వివరాల్లోకి వెళితే..
కర్ణాటక తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని కడశెట్టిహళ్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు శంకరమూర్తి, సుమంగళ. 50 ఏళ్ల శంకరమూర్తి వ్యవసాయం చేస్తుంటాడు. అతడి సతీమణి సుమంగళ తిప్టూరులోని కల్పతరు బాలికల హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు కరదాలుశాంతే గ్రామవాస్తవ్యుడైన నాగరాజుతో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
అయితే తమ బంధానికి అడ్డుగా తన భర్తను హతమార్చాలని ప్రియుడు నాగరాజుతో కలిసి స్కెచ్ వేసింది సుమంగళ.
పథకం ప్రకారం, ముందుగా సుమంగళ భర్త శంకరమూర్తి కళ్లలో కారం కొట్టింది. అనంతరం మంటతో విలవిల్లాడుతున్న మెుగుడ్ని కర్రతో గట్టిగా కొట్టి, గొంతుపై కాలితో తొక్కి చంపేసింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా అతడి శవాన్ని ఓ మూటలో కట్టి, సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ బావిలో పడేసింది. ఈ ఘటన జూన్ 24న జరిగింది.
శంకరమూర్తి ఎక్కడా కనిపించకపోవడంతో నొణవినకెరె పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అతడి ఇంటిని పరిశీలించగా..అక్కడ మంచం వద్ద కారం పొడి అనవాళ్లు కనిపించాయి. సుమంగళ కాల్ రికార్డులు పరిశీలించారు. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు నిజం అప్పుడు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ కేసుపై ఇంకా దర్యాప్తు జరుగుతుంది.