Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుHyderabad Crime: కోట్ల కక్ష.. కట్టుకున్నోడికే సుపారీ.. రూ.16 కోట్ల కోసం భర్త కిడ్నాప్‌కు భార్య...

Hyderabad Crime: కోట్ల కక్ష.. కట్టుకున్నోడికే సుపారీ.. రూ.16 కోట్ల కోసం భర్త కిడ్నాప్‌కు భార్య పక్కా ప్లాన్!

Wife kidnaps husband for money : బంధాలంటే బరువయ్యాయా? డబ్బు దాహానికి మానవత్వం మంటగలిసిందా? ఏడడుగులు నడిచిన భార్యే.. ప్రాణాలు తీయడానికి ఏకంగా కోటిన్నర సుపారీ ఇచ్చిందంటే నమ్మగలమా? హైదరాబాద్ నగరంలో సినిమాను తలపించేలా జరిగిన ఈ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. భర్తపై కక్షతో రగిలిపోతూ, అతని ఆస్తిని కాజేయాలని చూసిన ఓ భార్య పన్నిన ఈ కిరాతక పన్నాగం వెనుక ఉన్న కారణాలేంటి? రెండో పెళ్లి ఈ కుట్రకు ఎలా ఆజ్యం పోసింది? పోలీసుల వ్యూహంతో ఈ కిడ్నాప్ కథ ఎలా సుఖాంతమైంది?

- Advertisement -

భర్తకు చెందిన రూ.16 కోట్ల కోసం కన్నేసిన మొదటి భార్య, అతన్ని కిడ్నాప్ చేయించి, అంతమొందించాలని పన్నిన కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. అంబర్‌పేట డీడీ కాలనీలో గత నెల 29న జరిగిన ఈ కిడ్నాప్ కేసు మూలాల్లోకి వెళ్లిన పోలీసులకు, సూత్రధారి ఎవరో తెలిసి నివ్వెరపోయారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన భార్యతో సహా మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

అసలేం జరిగింది? కుట్రకు బీజం ఎక్కడ పడింది 
విడాకులు – రెండో వివాహం: కరీంనగర్‌కు చెందిన మంత్రి శ్యామ్, అతని మొదటి భార్య మాధవీలత కొంతకాలం అమెరికాలో ఉండి, ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం శ్యామ్ తన పేరును అలీగా మార్చుకుని, ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య మాధవీలత తన పిల్లలతో బండ్లగూడ సన్‌సిటీలో నివసిస్తోంది.

ఆస్తిపై కన్ను – హత్యకు పన్నాగం: ఇటీవలే మంత్రి శ్యామ్ బంజారాహిల్స్‌లోని తన 600 గజాల విలువైన స్థలాన్ని విక్రయించగా, రూ.16 కోట్ల నుంచి రూ.22 కోట్ల వరకు డబ్బు వచ్చిందని మాధవీలతకు తెలిసింది. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో కక్షతో రగిలిపోతున్న ఆమె, ఈ డబ్బును ఎలాగైనా కాజేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం అతన్ని అడ్డు తొలగించుకోవాలని కిరాతకమైన పథకం వేసింది.

కోటిన్నరకు సుపారీ: తన ప్లాన్‌ను అమలు చేయడానికి రాంనగర్‌కు చెందిన కట్ట దుర్గాప్రసాద్ అలియాస్ సాయితో మాధవీలత సంప్రదింపులు జరిపింది. తన భర్తను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత హత్య చేయడానికి ఏకంగా రూ.1.50 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

కిడ్నాప్ నుంచి అరెస్టు వరకు.. సినిమాటిక్ ఛేజ్..

“విడాకుల తర్వాత భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో మాధవీలత కక్ష పెంచుకుంది. అతనికి వచ్చిన ఆస్తి డబ్బుల కోసం ఈ కిడ్నాప్‌నకు పథకం రచించింది. దుర్గాప్రసాద్ ద్వారా మిగతా నిందితులను కూడగట్టుకుని అక్టోబరు 29న బాధితుడు మంత్రి శ్యామ్‌ను అతని ఇంటి నుంచే బలవంతంగా ఎత్తుకెళ్లారు.”
– బాలస్వామి, వెస్ట్ జోన్ డీసీపీ

రంగంలోకి పోలీసులు: కిడ్నాప్ జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అంబర్‌పేట పోలీసులు, డీడీ కాలనీలోని సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టారు. కారు నంబరు ఆధారంగా యజమానిని పట్టుకోగా, అది రెంటల్ కారని తేలింది.

కుట్రను చిత్తు చేసిన వ్యూహం: ఒప్పందం ప్రకారం, కిడ్నాపర్లు శ్యామ్‌ను నేరుగా మాధవీలత ఇంటికి తీసుకెళ్లి అప్పగించాలి. కానీ, పోలీసులు విచారణ నిమిత్తం ముందుగానే మాధవీలతను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రధాన సూత్రధారి అదుపులోకి రావడంతో కిడ్నాపర్లకు ఏం చేయాలో పాలుపోలేదు.

పరిగెత్తించి పట్టుకున్నారు: శ్యామ్‌ను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక, కిడ్నాపర్లు పోలీసులకు దొరక్కుండా కార్లు మారుస్తూ హైదరాబాద్ నుంచి చర్లపల్లి, అక్కడి నుంచి విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం వరకు తీసుకెళ్లి అనేక ప్రాంతాల్లో తిప్పారు. సాంకేతిక ఆధారాలతో వారి కదలికలను పసిగట్టిన పోలీసులు, చాకచక్యంగా వ్యవహరించి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. బాధితుడు మంత్రి శ్యామ్‌ను క్షేమంగా రక్షించారు. నిందితుల నుంచి 3 కార్లు, ద్విచక్ర వాహనాలు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad