Extramarital Affair Ends in Tragedy: వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబీకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. వారి పిల్లల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఈ తరహా ఘటన ఉప్పల్ పరిధిలోని నాగోల్‌లో చోటుచేసుకుంది.
ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి యువకుడి ఇంటికి: పరిచయమున్న మహిళ తన కళ్లముందే ఉరేసుకుంటున్నా.. ఎక్కడ పరువు పోతుందోనని బయపడి ఇతరుల సాయం కోరకుండా తానే రక్షించేందుకు ప్రయత్నించాడో యువకుడు. చివరికి తన కళ్ల ముందే ఆమె ప్రాణం పోవడంతో తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన నాగోల్ ఠాణా పరిధిలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన మహిళ(38), భర్త, కుమార్తె, కుమారుడు బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. అయితే.. వీరి ఇంటికి సమీపంలోని అంధుల కాలనీలోనే బానోత్ అనిల్ నాయక్(24) అనే యువకుడు ఉండేవాడు. అతనితో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నెల 20న తన మూడేళ్ల కుమారుడికి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని ఇంట్లో చెప్పి ఆమె అనిల్ వద్దకు వచ్చింది. 21న రాత్రి వరకు ఆ మహిళ అనిల్‌తో కలిసే ఉంది.
రాత్రి చోటుచేసుకున్న ఘటన: అయితే వారి మధ్య ఎలాంటి గొడవ జరిగిందో కానీ.. ఆ మహిళ అనిల్ ఉండే ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. రాత్రి సమయంలో కూరగాయలు తెచ్చేందుకు అనిల్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి.. ఆ మహిళ బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అతను తలుపు తీయమని ఎంత బతిమాలినా ఆమె స్పందించలేదు. దీంతో అనిల్ బాత్రూం వెంటిలేటర్ నుంచి చూసి షాక్ తిన్నాడు. ఆమె చీరతో ఉరివేసుకుంటూ కనిపించింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో భాగంగా తలుపు పగలగొట్టేలోపే ఆమె చీరతో హ్యాంగర్‌కు ఉరివేసుకుని తుదిశ్వాస విడిచిందని పోలీసులు తెలిపారు. ఆమె మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్, ఆత్మహత్యకు యత్నించి తన చేయి కోసుకున్నాడు. కానీ.. ఎదురుగా ఏడుస్తున్న ఆమె మూడేళ్ల కుమారుడిని చూసి చలించిపోయాడు. వెంటనే ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. రక్తస్రావమవుతున్న తన చేతికి దస్తీ కట్టుకుని నేరుగా నాగోల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో వెంటనే అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అనిల్‌ను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


