Woman, Husband Kill Lover with Screwdriver: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో అత్యంత దారుణమైన హత్య జరిగింది. భర్తతో కలిసి ఒక మహిళ తన ప్రియుడిని స్క్రూడ్రైవర్, ప్లయర్స్‌తో హింసించి, దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు అనీష్ (45), నిందితురాలు సితార మధ్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.
అప్పు తిరిగి ఇవ్వమన్నందుకా?.. అక్రమ సంబంధమా?
ఈ ఘటన సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. అనీష్ అనే 45 ఏళ్ల వ్యక్తిని తన పొరుగున ఉండే సితార, ఆమె భర్త రయీస్ అహ్మద్‌లు పథకం ప్రకారం హత్య చేశారు. అనీష్ మృతిపై అతని తండ్రి ముస్తకిమ్ మాట్లాడుతూ, తన కుమారుడు రయీస్‌కు గతంలో రూ. 7 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ డబ్బు అడగటానికి వెళ్లినప్పుడు అతన్ని దారుణంగా హత్య చేశారని ఆరోపించారు.
అయితే, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం, దర్యాప్తులో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది.
అనీష్, రయీస్ భార్య సితార మధ్య సంబంధం ఉందని, దీని గురించి రయీస్‌కు తెలియడంతో భార్యాభర్తలు కలిసి అనీష్ హత్యకు పథకం పన్నారని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం, సితార అనీష్‌ను ఇంటికి పిలిపించి, భర్తతో కలిసి స్క్రూడ్రైవర్, ప్లయర్స్‌తో దారుణంగా హింసించి చంపారని పేర్కొన్నారు. పోలీసులు ప్రస్తుతం నిందితులైన రయీస్, సితారలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


