Woman Raped By Ambulance Driver: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్‌లోనే అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కీచకులు. పరీక్ష కోసం హాజరై స్పృహ తప్పి పడిపోయిన యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్. ఈ దారణమైన ఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
బిహార్‌లోని భోధ్‌గయలో హోంగార్డు పరీక్షకు అదే ప్రాంతానికి చెందిన యువతి హాజరైంది. దేహదారుఢ్య పరీక్ష సందర్భంగా ఆమె స్పృహ తప్పిపడిపోయింది. దీంతో అంబులెన్స్‌ను పిలిచింది ఆమెను ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఈ క్రమంలోనే ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి రెండు గంటల్లోనే నిందితులు వినయ్ కుమార్, అజిత్ కుమార్‌లను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించడం సులభమైందని పోలీసులు తెలిపారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, కేసు దర్యాప్తును వేగవంతం చేసి, త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


