Woman’s Chopped Up Body Found Stuffed in Plastic Bags: కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తలను, ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో పడేసి వెళ్లారు కొందరు దుండగులు. తుమకూరు జిల్లా, కోరటగెరెలోని కొలల గ్రామం వద్ద ఈ ప్లాస్టిక్ బ్యాగులు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పూర్తి వివరాలు..
ఈ దారుణమైన ఘటన ఆగస్టు 7న వెలుగులోకి వచ్చింది. కొలల గ్రామం వద్ద రోడ్డు పక్కన కొన్ని అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగులు కనిపించాయి. అటుగా వెళ్తున్న కొందరు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. మొదట ఏడు ప్లాస్టిక్ బ్యాగుల్లో మహిళ శరీర భాగాలను గుర్తించారు. ఆ తర్వాత ఆగస్టు 8న పోలీసులు క్షుణ్ణంగా గాలించగా, మరో ఏడు ప్లాస్టిక్ బ్యాగుల్లో తలతో సహా మరికొన్ని శరీర భాగాలు లభ్యమయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ హత్య మరొక ప్రాంతంలో జరిగి ఉండవచ్చని, మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపి కారులో తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చింపుగన్‌హళ్లి, వెంకటపుర గ్రామాల మధ్య రోడ్డు పొడవునా ఈ శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
గాలింపు చర్యలకు ఆటంకం..
మహిళ తల లభ్యం కావడంతో ఆమెను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు తుమకూరు ఎస్పీ అశోక్ కేవీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


