Delhi Murder Conspiracy Charred Body Case: ఉత్తర ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో మూడు వారాల క్రితం అగ్నిప్రమాదంలో కాలిపోయిన మృతదేహం లభించిన కేసులో పోలీసులు అత్యంత భయంకరమైన హత్యకుట్రను ఛేదించారు. మృతుడు రామ్ కేశ్ మీనా (32), సివిల్ సర్వీసెస్ ఆశావహుడు. ఈ హత్యకు అతనితో సహజీవనం చేస్తున్న అమృత చౌహాన్ (21), ఆమె మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్‌లే సూత్రధారులని తేలింది. వీరిద్దరూ మరో స్నేహితుడిని కలుపుకుని ఈ హత్యను అత్యంత పకడ్బందీగా అమలు చేశారు.
అనేక ప్రశ్నలు..
అక్టోబర్ 6న గాంధీ విహార్‌లోని ఒక ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగిందనే సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పిన తర్వాత, నాలుగో అంతస్తులోని ఫ్లాట్‌లో పూర్తిగా కాలిపోయిన మృతదేహం లభించింది. అది రామ్ కేశ్ మీనాదని గుర్తించారు.
రామ్ కేశ్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అగ్నిప్రమాదం జరిగిన రాత్రి భవనంలోకి ప్రవేశించడం, కొద్దిసేపటి తర్వాత వారిలో ఒకరు బయటకు రావడం కనిపించింది. ఆ తర్వాత ఒక పురుషుడు, ఒక మహిళ ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లారు. ఆ మహిళ రామ్ కేశ్‌తో సహజీవనం చేస్తున్న అమృత చౌహాన్ అని గుర్తించారు. వారు వెళ్లిన వెంటనే మంటలు చెలరేగినట్లు ఫుటేజ్‌లో రికార్డ్ అయింది.
ALSO READ: Tribal Minors Gang Raped: ఒడిశాలో ‘జాతర’ చూసి వస్తుండగా ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై గ్యాంగ్ రేప్
హత్యకుట్రకు కారణం
విచారణలో, రామ్ కేశ్ తన ప్రైవేట్ వీడియోలను హార్డ్ డిస్క్‌లో నిల్వ చేశాడని, వాటిని తొలగించడానికి నిరాకరించాడని అమృత తెలిపింది. దీంతో ఆగ్రహం చెందిన అమృత, తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్‌తో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసింది. సుమిత్ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పనిచేయడం, అమృతకు ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని కావడం, క్రైమ్ వెబ్ సిరీస్‌లపై ఆసక్తి ఉండటం ఈ కుట్రకు మరింత బలం చేకూర్చింది.
అక్టోబర్ 5వ తేదీ రాత్రి, సుమిత్, వారి స్నేహితుడు సందీప్ కుమార్ కలిసి రామ్ కేశ్‌ను కొట్టి, గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి, మృతదేహంపై నూనె, నెయ్యి, వైన్‌ను పోశారు. సుమిత్ వంటగదిలోని గ్యాస్ సిలిండర్‌ను మృతదేహం దగ్గర ఉంచి, నాబ్‌ను తెరిచి గ్యాస్‌ను గదిలోకి నింపాడు. అనంతరం లైటర్‌తో నిప్పంటించి తలుపు వేసి పారిపోయారు. వారు వెళ్లిపోయిన ఒక గంట తర్వాత సిలిండర్ పేలింది. నిందితులు హార్డ్ డిస్క్‌తో పాటు రామ్ కేశ్ ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులను తీసుకుని పరారయ్యారు. అయితే, వారి పకడ్బందీ ప్రణాళికను సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టింది.

