Homeనేరాలు-ఘోరాలుNational Commission for Women: నర్సు హత్యపై మహిళా కమిషన్‌ సీరియస్.. వారం రోజుల్లో సమగ్ర...

National Commission for Women: నర్సు హత్యపై మహిళా కమిషన్‌ సీరియస్.. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం

హైదరాబాద్‌ (తెలుగుప్రభ): రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న 21 ఏళ్ల నర్సుపై జరిగిన లైంగిక దాడి, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ దారుణ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన కమిషన్‌.. కేసు దర్యాప్తు పురోగతిపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ డీజీపీకి లేఖ రాశారు. కేసు దర్యాప్తు పురోగతి, సేకరించిన ఫోరెన్సిక్‌ ఆధారాలు, ఛార్జిషీట్‌ దాఖలుకు సంబంధించిన వివరాలతో కూడిన ‘యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు’ను వారం రోజుల్లోగా సమర్పించాలని ఎన్‌సీడబ్ల్యూ సూచించింది. నిందితుడి నేర చరిత్ర, ఘటనకు దారితీసిన కారణాలు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వేగవంతమైన కస్టోడియల్‌ విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. అత్యాచారం, హత్య, అక్రమ ప్రవేశం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని కఠిన నిబంధనల కింద కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది.

- Advertisement -

ఆధారాలను భద్రపరచాలి
బాధితురాలి వైద్య, పోస్టుమార్టం నివేదికలతోపాటు డిజిటల్‌ ఆధారాలు, కాల్‌ డేటా రికార్డులు, ఫోరెన్సిక్‌ సాక్ష్యాలను భద్రపరిచి సమగ్రంగా పరిశీలించాలని కమిషన్‌ ఆదేశించింది. కేసు దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని కోణాల్లో విచారణ జరిపి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

కుటుంబానికి అండగా నిలవాలి
బాధితురాలి కుటుంబానికి తగిన భద్రత కల్పించడంతోపాటు ఉచిత న్యాయ సాయం అందించాలని ఎన్‌సీడబ్ల్యూ సూచించింది. చట్టప్రకారం చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా వీలైనంత త్వరగా అందజేయాలని పేర్కొంది. ఉద్యోగాలు చేసే మహిళల భద్రత, ఆత్మగౌరవం విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని జాతీయ మహిళా కమిషన్‌ స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఈ కేసు దర్యాప్తును నిశితంగా పర్యవేక్షిస్తామని వెల్లడించింది. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్‌ సనా ఉల్లా (34)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News