Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంతో అక్కను అతి దారుణంగా తమ్ముడు నరికి చంపాడు. ఆత్మకూరు (ఎస్) మండలానికి చెందిన సురుగి అంజమ్మ అనే మహిళ భర్త గతంలోనే మరణించాడు. ఆమెకు పిల్లలు లేకపోవడంతో.. స్వగ్రామంలోని తన చెల్లెలి వద్దే నివాసం ఉంటుంది. అంజమ్మ బాగోగులన్నీ చెల్లెలే చూసుకుంటుండటంతో.. తన పేరిట ఉన్న రెండు ఎకరాల భూమిని ఆమెకే ఇచ్చేందుకు అంజమ్మ నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయం తమ్ముడికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆస్తి చెల్లెలికి కాకుండా తనకే దక్కాలనే దురాశతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
కరువు పనికి వెళ్తుండగా ఘాతుకం: ఈ క్రమంలో ఈరోజు ఉదయం సుమారు 6:45 గంటల ప్రాంతంలో అంజమ్మ ఎప్పటిలాగే ఉపాధి హామీ పనికి బయలుదేరింది. ఆమె వెళ్తున్న దారిలో మాటువేసిన తమ్ముడు.. వెనుక నుంచి వచ్చి పదునైన కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అంజమ్మ శరీరంపై పలుమార్లు తీవ్రంగా నరకడంతో.. ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Also read-Nalgonda: ఆయిల్ పామ్ తోటలో దారుణం.. తల్లీకూతుళ్ల ఘోర హత్య!
పోలీసుల దర్యాప్తు: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

