Wednesday, July 3, 2024
HomeదైవంAdoni: కన్నుల పండువగా లక్ష్మమ్మ అవ్వ జాతర

Adoni: కన్నుల పండువగా లక్ష్మమ్మ అవ్వ జాతర

ఆదోని ప్రజల ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం

ఆదోని ప్రజల ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ జాతర కనుల విందుగా జరిగింది. గురువారం 92వ వెండి రథోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ వంశపార్య ధర్మకర్త, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రామయ్య నేతృత్వంలో అవ్వ జాతర వేడుకలు నిర్వహించారు.

- Advertisement -

మహాయోగి లక్ష్మమ్మ అవ్వ పుట్టినిల్లు అయిన చాగి గ్రామస్థులు, అర్థరాత్రి నుండే గ్రామం నుండి ఊరేగింపుగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అవ్వకు మహా మంగళ హారతి, కుంకుమార్చన, పూజలు ఆలయ పూజారులు నిర్వహించారు.

ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో, పూలతో ముస్తాబు చేశారు. అవ్వ గర్భ గుడి, జీవ సమాధిని ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారు జామున 3 గంటల నుండి అవ్వకు మొక్కుబడులు తీర్చుకునేందుకు భక్తులు కొలువుదీరారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు.

సాయంత్రం 4.30 గంటల నుండి అవ్వ వారి విగ్రహాన్ని వెండి రథంలో కూర్చోబెట్టి, పురవీధుల్లో ఊరేగించారు. ఊరేగింపు ముందు మహిళలు, ముత్తైదువులు కలశాలతో ముందుకు సాగగా, మహాయోగి లక్ష్మమ్మకు జై అంటూ నినాదాలు అంబరాన్ని అంటాయి. రథోత్సవానికి పట్టణ ప్రజలే కాక, గ్రామీణ ప్రజలు, కొత్తగా పెళ్లి అయిన జంటలు విచ్చేసి కలశ దీపంను దర్శించుకున్నారు.

ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉదయం సతీమణితో వచ్చి అవ్వకు మొక్కుబడులు సమర్పించుకున్నాడు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి అవ్వ దర్శనం చేసుకొని, రథోత్సవం ఊరేగింపులో పాల్గొన్నాడు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన మజ్జిగ, రస్నా పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు, ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె కృష్ణమ్మ పాల్గొని అందజేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ యాదవ్ కూడా ఆ సమయంలో రావడంతో కృష్ణమ్మ పిలిచి ఆయనచే పంపిణీ చేయించారు. మధ్యహ్నం ఆలయ కమిటీ భక్తులకు అన్నదాన వితరణ చేసారు. డిఎస్పీ శివ నారాయణ శర్మ నేతృత్వంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News