ఆదోని లోని సంతేకుడ్లూరులో ఏటా వినూత్నంగా హోలీ వేడుకలు జరుగుతాయి. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఆదోని మండలంలోని మారుమూల గ్రామమైన సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగను గత 100 సంవత్సరాలుగా పైగా భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు నిర్వహించుకుంటారు. సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ అంటే మగవారు ఆడవారి వేషధారణ చేసి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తాము మొక్కుకున్న మొక్కులు తీరాలంటే రథి మన్మధులను మెప్పించేందుకు మగవారు చీర కట్టుకొని నగలు పెట్టుకుని బొట్టు పెట్టుకొని ఆడవారి వేషాధరాణలో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
ఎంతటి కోరికైనా..
గత వందేళ్లుగా రతీ, మన్మథులను మెప్పిస్తూ వారి ఆనవాతి ప్రకారం హోలీని జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా ఉద్యోగం రావాలన్నా, పంటలు బాగా పండాలన్నా, జీవనం సుఖసంతోషాలతో ఉండాలన్నా, దీర్ఘ కాలిక వ్యాధులు నయం కావాలన్నా, మనసులో ఉన్న ఏ కోరిక అయినా తీరాలంటే రథి, మన్మథుని దేవాలయంలో మొక్కు మొక్కుకుని , మొక్కు తీరిన వెంటనే పురుషులు ప్రతి ఏడాది వారి జీవితకాలం పాటు చీర కట్టుకుని రతి మన్మథుల దేవాలయంకు బాజా భజంత్రులతో వెళ్లి, నైవేద్యాలతోనూ, పూలు పండ్లతో ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కలు తీర్చుకోవావాలి.
సుదూరాల నుంచి..
రతి మన్మథులకు ఇలా మొక్కుకోవటం కోసం, మొక్కు తీర్చుకోవటం కోసం బెంగళూరు, హైదరాబాదు, ముంబై తదితర పట్టణాల్లో స్థిరపడ్డ డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా వివిధ రంగాలకు చెందినవారు వస్తుంటారు.
భక్తుల కోసం అన్నదానం కూడా..
ఈ వింత వేడుకలు చూడడానికి కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రలతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంతేకుడ్లూరు గ్రామానికి ప్రతి ఏడాది హోలీ పండుగ రోజున తరలి వస్తారుకూడా. రతి-మన్మథుల వేడుకలో భాగంగా ప్రతి రోజూ గ్రామములో సాంస్కృతి కార్యక్రమాలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు గ్రామస్థులు.