Shubha Muhurat : భారతీయ సంస్కృతిలో వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథిని ‘అక్షయ తృతీయ’గా జరుపుకుంటాం. ‘అక్షయ’ అనే పదానికి ‘నశించనిది’ లేదా ‘తరిగిపోనిది’ అని అర్థం. ఈ రోజున ప్రారంభించే ఏ కార్యమైనా, కొనుగోలు చేసే ఏ వస్తువైనా జీవితాంతం సుఖసంతోషాలను, అభివృద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 2026 సంవత్సరంలో ఈ పర్వదినం ఏప్రిల్ 19వ తేదీ, ఆదివారం నాడు రానుంది. ఈ రోజు ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.
తిథి , పూజా ముహూర్త వివరాలు
తెలుగు పంచాంగం ప్రకారం, తృతీయ తిథి ఏప్రిల్ 19, ఆదివారం ఉదయం 10:49 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 07:27 గంటల వరకు ఉంటుంది. పూజలు నిర్వహించుకోవడానికి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:26 వరకు అత్యంత శుభప్రదమైన సమయమని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
బంగారం కొనుగోలుకు ప్రత్యేక ప్రాముఖ్యత
అక్షయ తృతీయ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం కొనుగోలు. ఈ రోజున కనీసం చిన్న ముక్క బంగారమైనా కొంటే లక్ష్మీదేవి తమ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుందని నమ్ముతారు. 2026 అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 05:57 గంటల వరకు సుదీర్ఘమైన ముహూర్తం అందుబాటులో ఉంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా ఇల్లు, వాహనం లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి కూడా ఈ రోజును ‘అబూజ ముహూర్తం’ (ఎటువంటి ముహూర్తం చూడక్కర్లేకుండా పనులు ప్రారంభించవచ్చు) అని పిలుస్తారు.
ఆధ్యాత్మిక , పౌరాణిక నేపథ్యం
ఈ రోజుకు పౌరాణికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కృతయుగం ముగిసి, త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి అవతారాలైన పరశురాముడు , హయగ్రీవుడు ఈ రోజే జన్మించారు. అంతేకాకుండా, గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు కూడా ఇదేనని ప్రతీతి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలను కూడా ఈ రోజునే తెరుస్తారు. మహాభారత కాలంలో పాండవులకు సూర్యభగవానుడు ‘అక్షయ పాత్ర’ను ప్రసాదించింది కూడా ఈ వైశాఖ శుద్ధ తదియ నాడే కావడం విశేషం.
దానధర్మాల విశిష్టత
అక్షయ తృతీయ కేవలం సంపదను కూడబెట్టుకోవడమే కాకుండా, దానగుణానికి కూడా ప్రసిద్ధి. ఈ రోజున చేసే దానాల వల్ల వచ్చే పుణ్యం అక్షయంగా (శాశ్వతంగా) ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పేదలకు చెప్పులు, గొడుగులు, బియ్యం, గోధుమలు లేదా నీటి కుండలను దానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. తమ పూర్వీకులకు (పితృదేవతలకు) తర్పణాలు వదిలేందుకు కూడా ఈ రోజు చాలా పవిత్రమైనది.
Lemon Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగితే..ఈ అద్భుతమైన 5 ఆరోగ్య లాభాలు మీ సొంతం..

