Friday, November 22, 2024
HomeదైవంAP temples: 400 కోట్లతో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, శ్రీశైల దేవస్థానాల అభివృద్ది

AP temples: 400 కోట్లతో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, శ్రీశైల దేవస్థానాల అభివృద్ది

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవాలయ అభివృద్ది పనులకు రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులు

దాదాపు రూ.400 కోట్లతో విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి మరియు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానాల అభివృద్ది పనులను నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ ప్రతి వారం మాదిరిగానే నేడు కూడా ధర్మాదాయ, దేవాదాయ శాఖపరంగా సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కొట్టుసత్యనారాయణ మాట్లాడుతూ ఈ మొత్తం రూ.400 కోట్ల నిధులలో రూ.225 కోట్లను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్దికి మరియు రూ.175 కోట్లను శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ది పనులకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్దికై వాస్తుపండితులు, స్తపతులు, పలువురు నిపుణులతో ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా కమిటీ సూచనలతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించడమైందన్నారు. ప్రస్తుతం ఆ మాస్టర్ ప్లాన్ అమలుకు టెండర్ల ఖరారు ప్రక్రియ కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెలలోనే ఆ మాస్టర్ ప్లాన్ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా మల్టీ లెవిల్ క్యూ కాంప్లెక్సు, క్యూ కాంప్లెక్సు నుండి అన్నదాన భవనానికి వెళ్లేందుకు బ్రిడ్జి, అమ్మవారి కుంకుమ పూజల నిర్వహణకై రెండు అంతస్తుల పూజా మండపం, దుర్గా నగర్ ప్రవేశ మార్గం ప్రక్కన బి.ఓ.టి. విధానంపై మెకనైజ్డు మల్టీలెవిల్ కార్ పార్కింగ్ తదితర పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఉచిత దర్శనాలతో పాటు రూ.100/-, రూ.300/-, రూ.500/- టికెట్లు పై అమ్మవారి దర్శనం చేసుకునేందుకు అనువుగా పలు రకాల ర్యాంపులను కూడా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా నిర్మించే ఎక్సెటెన్షన్ క్యూ కాంప్లెక్సు నుండే వి.ఐ.పి.లు, జడ్జిలు, ఇతర ప్రముఖులు అమ్మవారి దర్శనానికి వచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా లిప్టులు, లాంజ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డు వాస్తురీత్యా నైరుతీ దిశలో ఉన్నందున, ఇది శుభ ప్రధం కాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దేవాలయాలనికి తూర్పు వైపునున్న రాజగోపురం నుండే భక్తులు రాక పోకలు సాగించేలా, అందుకు అవసరమైన అభివృద్ది కార్యక్రమాలను ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా అమలు పర్చనున్నామన్నారు. అదే విధంగా సాదారణ రోజుల్లో కంటే దసరా శరన్నవరాత్రి, శివరాత్రి ఉత్సవాల సమయంలో వచ్చే లక్షలాది భక్తులతోపాటు భవానీ దీక్షలతో వచ్చే భక్తుల నిర్వహణకు అనువుగా ఈ మాస్టర్ ప్లాన్ పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ది పనులకు రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ నిధులతో ప్రసాదం పోటు, అన్న దానం భవనం, శివాలయం, కొండ రాళ్లు దొర్లి భక్తులపై పడకుండా రాక్ మిటిగేషన్ పనులు మరియు స్కాడా పనులను చేపట్టి కొన్నింటిని పూర్తి చేయడమైందని తెలిపారు. రూ.175 కోట్లతో శ్రీశైల దేవస్థానాల అభివృద్ది……. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అభివృద్ది పనులను రూ.175 కోట్లతో చేపట్టినట్లు ఆయన తెలిపారు. రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్సు, రూ.40 కోట్లతో సాల మండపాల నిర్మాణం మరియు మాడ వీధుల అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఆక్రమణలను తొలగించి రోడ్లను 60 అడుగుల మేర విస్తరించడం జరిగిందని, ఈ రోడ్డుకి ఇరువైపులా సాల మండపాలు కట్టించి భక్తులు అందరూ కూడా వాటిలో నిద్ర చేసే అవకాశాన్ని కల్పించడం జరుగుచున్నదన్నారు. ఆ సాల మండపాల్లో ప్యాన్లు, టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యాలు కల్పించడం జరుగుచున్నదన్నారు. 220 డీలక్సు రూములతో ఒక అతిథి గృహం కూడా నిర్మించడం జరిగిందని, దాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 4,600 ఎకరాల భూమిని ఆలయ పరిధిలోకి తీసుకు రావడం జరిగిందని, దాని ఫెన్సింగ్ కార్యక్రమాన్ని త్వరలో శంకుస్థాపన చేయనున్నామన్నారు. అక్టోబరు నుండి మార్చి వరకూ 175 6(ఎ) దేవాలయాల్లో సనాతన హిందూ ధర్మ ప్రచారం…..
సనాతన హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ధర్మ ప్రచార పరిషత్ సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని గత మాసం 6 న అన్నవరంలో ప్రారంభించడం జరిగిందన్నారు. 18 వ తేదీన శ్రీకాళహస్తిలో నిర్వహించడమైనదని, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ నెల 16 వ తేదీన కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే ఈ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 175 6(ఎ) దేవాలయాల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు మాసంలో ప్రారంభించడం జరుగుతుందని, నెలకు నాలుగు జిల్లాలు చొప్పున అది మార్చి వరకూ కొనసాగుతుందన్నారు. అందుకు తగ్గట్టుగా ఆయా దేవాలయాల అధికారులను అందరినీ అప్రమత్తం చేయడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకై త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News