సింహాచలం(Simhachalam) వరాహా లక్ష్మీ నరసింహస్వామి డోలోత్సవం (పెళ్లి చూపులు) మార్చి 14న వైభవంగా నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రతీ ఏటా పాల్గుణ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ అర్చక వర్గాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.
పౌర్ణమి రోజు వేకువ జామునే సింహాద్రి నాధుడిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన చేస్తారు. అనంతరం సర్వాభరణాలతో అలంకరించి పల్లకిలో ఆశీనులను చేసి మెట్ల మార్గంలో కొండ దిగువకు తీసుకువస్తారు. తొలిపావంచ వద్ద ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గ్రామంలోకి ఆహ్వానం పలుకుతారు. స్వామి నేరుగా తన సోదరి శ్రీ పైడితల్లి వారి ఆలయానికి చేరుకుంటారు. పైడి తల్లిని దర్శించుకున్న అనంతరం తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని కోరుతారు.
స్వామి మహిమలకు మెచ్చి
స్వామి గొప్పతనం, మహిమలు అర్చక స్వాములు అమ్మవారికి తెలియజేయడంతో తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు అమ్మవారు అంగీకరిస్తారు. దీంతో స్వామి గ్రామంలోకి బయలుదేరుతారు. పుష్కరిణి సత్రంలో స్వామిని ఆశీనులను చేసి డోలోత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవం, చూర్ణోత్సవం తదితర వైదిక కార్యక్రమాలు జరిపిస్తారు. ఆ రోజు డోలీలో స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పురాణా
ఇతిహాసాల కథనం.
రంగులు చల్లుకుంటూ సంబరాలు
స్వామికి వివాహం నిశ్చయం కావడంతో అర్చకులు, అధికారులు, సిబ్బంది రంగులు చల్లుకుంటారు. అనంతరం స్వామి తిరువీధికి బయలుదేరుతారు. ప్రజలు ఇళ్ల ముంగిట ముగ్గులు వేసి స్వామిని మంగళ హారతులతో స్వాగతించి దర్శించుకుంటారు. తిరువీధి అనంతరం సింహాద్రినాధుడు మెట్ల మార్గంలో కొండ మార్గం ద్వారా సింహగిరిపై ఆలయానికి చేరుకుంటారు.
ఒకే నెలలో రెండు ప్రధానోత్సవాలు
మార్చి 14న సింహాద్రి అప్పన్నకు డోలోత్సవం జరగనుండడంతో ఉగాదికి పెళ్లికొడుకు అలంకరణ చేయనున్నారు. అదే రోజు నుంచి స్వామి పెళ్లి పనులు ప్రారంభిస్తారు. మార్చి 30న ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ రోజు కవి సమ్మేళనం, పంచాంగశ్రవణం, దాతలకు పండిత సత్కారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే స్వామి వార్షిక కళ్యాణం, సింహాద్రినాధుడి చందనోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఒకే నెలలో రెండు ప్రధానోత్సవాలు జరగనున్నాయి.