Saturday, November 23, 2024
HomeదైవంAshada Bonalu: ఆషాఢ బోనాల రహస్యాలు తెలుసా?

Ashada Bonalu: ఆషాఢ బోనాల రహస్యాలు తెలుసా?

పండుగల్లేని నెలలో జాతరలా? పోతురాజు ఎవరు ? ఆదివారమే బోనాలెందుకు ?

శుభకార్యాలు ఏవీ లేకపోయినా తెలంగాణ అంతా జాతర్లతో హోరెత్తే ఆషాఢానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఆషాఢం అంటే ఒక తెలుగు నెల పేరు.  వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవ్వగానే మనకు ఆషాఢం వచ్చేస్తుంది.  ఈ నెలలో పెద్ద పండుగలు ఏమీ ఉండవు.  పైగా శుభకార్యాలు మన తెలుగువాళ్లు ఎవరూ చేయరు.  కానీ తెలంగాణలో మాత్రం ఆషాఢం సరికొత్త శోభను సంతరించుకుంటుంది.  గోల్కొండ జగదాంబికా ఎల్లమ్మ అమ్మవారితో ప్రారంభమయ్యే బోనాల సంబురాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. 

- Advertisement -

విశిష్ఠమైన మాసం

ఆషాఢమాసం చాలా విశిష్టమైనది.  ఏకాదశి, గురుపౌర్ణమి, చాతుర్మాస వ్రతాలు స్టార్ట్ అయ్యే సీజన్ ఇదే.  పూరి జగన్నాథ రథయాత్ర జరిగేది కూడా ఈ నెలలోనే.  కానీ కొత్తగా పెళ్లైనవారు మాత్రం వేరువేరుగా ఉండాలి.  అత్తా-కోడళ్లు ఒకే గడప దాటరాదన్న సంప్రదాయం ప్రకారం కోడళ్లు పుట్టింటికి వెళ్లిపోతారు.   తొలి ఏకాదశి వచ్చేది ఈ నెలలోనే. తొలి ఏకాదశితో పండుగలు స్టార్ట్ కాబట్టి ఏకాదశి పండుగలు వెంటబెట్టుకుని వస్తే ఉగాది ఊడ్చుకుని పోతుందనే సామెత వచ్చింది.

ప్రతి వారానికీ ఏదో ప్రత్యేకతుంది

నిజానికి ఈనెలలో  ప్రతివారం ఏదో ఓ పండుగ, వ్రతము, పూజ ఉండనే ఉంటాయి.  చాతుర్మాసం గురించి మీరు కూడా వినే  ఉంటారు కదా.  పీఠాధిపతులు, మఠాధిపతులు, సన్యాసులు నాలుగు నెలలపాటు కఠిన దీక్షతో ఒకే చోట ఉండే ప్రత్యేకమైన మాసం ఇది.   ఈ నాలుగు నెలలు.. ప్రతినెలా ఏదో ఒకటి మానేస్తూ.. చివరికి..చాలా తక్కువ ఆహారంతో.. నామమాత్రం ఫుడ్ తో.. సన్యాసులు దీక్షను తీసుకుంటారు. తొలి ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభమవుతుంది.  ఆతరువాత.. దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది.. అంటే.. పండుగలు స్టార్ట్ అయ్యే సీజన్ వచ్చేసినట్టు లెక్క.  మళ్లీ  ఉత్తరాయణం స్టార్ట్ అయ్యేవరకు..అంటే.. సంక్రాంతి వరకు.. పండుగలే పండుగలు.

ఆషాఢ నియమాలు ఆరోగ్యానికి మంచిది

ఆషాఢంలో మనం కొన్ని సంప్రదాయాలు పాటిస్తే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వర్షాల వల్ల కంటామినేషన్ చాలా ఎక్కువ.  పైగా గాలి కాలం కూడా కావటంతో చాలా రోగాలు వచ్చే టైం.  అందుకే గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం కూడా వచ్చింది. చేతులు, చేతి గోర్ల ఆరోగ్యం పాడై చేతులకు గోరుచుట్ట వంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లో వేడి తగ్గటమే కాదు చేతులు భద్రంగా, ఆరోగ్యంగా ఉంటాయనే గోరింటాకు సంప్రదాయం వచ్చింది.  సో.. ఆషాఢం పోయేలోగా గోరింటాకు పెట్టుకునే బదులు ఆషాఢం స్టార్ట్ అయిన కొత్తల్లోనే గోరింట పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.  ఆయుర్వేదంలోకూడా ఇదే వివరిస్తారు.

రోగాల సీజన్ కూడా

వర్షాలవల్ల కొత్తనీరు వస్తుంది. ఈ కొత్త నీరుతో చాలావరకు మనకు ఆరోగ్యాలు దెబ్బతింటాయి.  దీంతో కూడా మనకు కొన్ని వైరల్ ఫీవర్స్ వంటివి వస్తాయి.  దోమలు విపరీతంగా ఉండి వర్షాకాలమంతా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.   అందుకే మాన్సూన్ లోకి వెదర్ ట్రాన్సిట్ అయ్యేటైంలో జ్వరాలు, దగ్గు, గొంతునొప్పి, ఇన్ఫెక్షన్స్ ఇంకా ముఖ్యంగా మోషన్స్, కలరా, వామ్టింగ్స్ వంటివి వస్తాయి.   గ్రామ దేవతలకు పూజలు చేసి అమ్మవారు, తట్టు, కలరా వంటివాటి నుంచి తమను, తమ గ్రామాన్ని, ప్రజలను కాపాడాలని బోనాల వంటి జాతరలు చేసి అమ్మవారిని శాంతింపజేస్తారన్నమాట. 

బోనాలు అంటే ?

బోనాలు అంటే బోనం అంటే భోజనం అని అర్థం.  అమ్మవారికి శుభ్రంగా, భక్తి శ్రద్ధలతో శక్తిమేర భోజనం సమర్పించటమే బోనాలు ఆచారం వెనుకున్న అర్థం, పరమార్థం.  తమకు కావాల్సిన వారందరినీ పిలిపించుకుని  అమ్మవారికి బోనమెత్తి, జాతరలో పాల్గొని అందరూ కలసిమెలసి వండుకుని తినటమే బోనాల పండుగ ఆంతర్యం.

బోనమెత్తే జంటనగరాలు

హైదరాబాద్, సికింద్రాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ బోనాలు సంప్రదాయబద్ధంగా, వారివారి ఆచారాలను బట్టి జరుపుకుంటారు.  రాయలసీమ, కోస్తా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా బోనాలు జరుపుకుంటారు. రేణుకా ఎల్లమ్మ, మల్లమ్మ, మైసమ్మ, గండి మైసమ్మ, బంగారు మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరెమ్మ, మారెమ్మ, మహంకాళమ్మ..ఇలా రకరకాల పేర్లతో  గ్రామ దేవతలను పిలుస్తారు. వీరందరికీ బోనం ఎత్తటం ఆషాఢంలో అసలు పూజ. 

బంగారు బోనం

ఈ బోనం కూడా శక్తిమేర అలంకరిస్తారు.. బంగారు, వెండి, రాగి, మట్టి వంటి వాటితో చేసిన గిన్నెలను బోనంగా అలంకరిస్తారు.  డప్పుతో పాటు స్థానిక జానపద నృత్యాలు, ఆటలు, పాటలు హోరెత్తుతుండగా వాటిమధ్య సాగుతుంది బోనాల పండుగ. వేప రెమ్మలు, పసుపు, కుంకుమతో వేసిన ముగ్గులు, మధ్యలో దీపం పెట్టుకుని ఆడవాళ్లు బోనం తీసుకెళ్తారు. ఈ బోనం తీసుకెళ్లటంలో మహిళలు చాలా ఉత్సాహం చూపుతారు.  మనసంతా భక్తి నింపుకుని తలపై బోనం ఎత్తుతారు.  పట్టుచీరలు కట్టుకుని, నగలు వేసుకుని సాక్షాత్తూ లక్ష్మీ దేవిలా తయారై చిన్నా పెద్దా అంతా ఊరేగింపుగా బోనాన్ని తీసుకెళ్తారు.  బోనానికి పసుపు, కుంకుమ, వేప మండలు, సున్నం వంటివి వేసి అందులో భోజనం-పానకం పెట్టి అలంకరిస్తారు.  ఇలా చేస్తే ఏ వైరస్ లు ఈ బోనంలో చేరే ఛాన్స్ ఉండదు. పైగా యాంటీ సెప్టిక్, యాంటీ బయాటిక్ గా ఈ సంప్రదాయాలు సాగుతాయి.  మహిళలు కాళ్లకు పసుపు రాసుకుంటే అంతకు మించిన యాంటీ బయాటిక్ ఇంకోటి ఉండదు కదా. వర్షాకాలంలో కాళ్ల పగుళ్లకు ఆడవాళ్లు సిక్ అవుతారు. అందుకే సీజన్ కు తగ్గట్టుగానే బోనాల్లో కొన్ని సంప్రదాయాలు మన పెద్దలు ప్రవేశపెట్టి వాటిని కచ్ఛితంగా పాటించేలా నియమాలు పట్టారు. అంతేకానీ ఇవేవీ మూఢనమ్మకాలు కావు. 

విన్యాసాలు-పూనకాలు

పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, రంగంలో భవిష్యత్ చెప్పటం, ఫలహారాల ఊరేగింపు, ఘటాల అలంకారాలు, భక్తుల బోనాలు, యాటలతో.. అమ్మవారి ప్రాంగణం అంతా.. కోలాహలంగా .. భలేగా ఉంటుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. బోనాల పండుగను.. స్టేట్ అఫిషియల్ ఫెస్టివల్ గా..అంటే.. రాష్ట్ర పండుగగా కండక్ట్ చేస్తున్నారు.  ఇందుకు.. ప్రత్యేకంగా బడ్జెట్ ను కూడా అలొకేట్ చేస్తున్నారు.

శక్తిమేర తొట్టల

తొట్టెల అంటే మీకు తెలుసా? తమ శక్తిమేర తొట్టెలను తయారు చేసి వాటిని అమ్మవారి గుళ్లకు ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పిస్తారు.  తొట్టెల అమ్మవారికి సమర్పించటం బోనాల్లో భాగం.  బోనాలు స్టార్టింగ్ విషయానికి వస్తే గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం తొలి ఆదివారం రోజు ప్రారంభమవుతుంది.  ఆ తరువాతి ఆదివారం. లష్కర్ బోనాలు అంటే సికింద్రాబాద్ బోనాలు జరుగుతాయి.  ఉజ్జయిని మహంకాళి ఆలయంలోఇవి సాగుతాయి.  ఆతరువాత ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజలో బోనాలు ముగింపుకు వస్తాయి.  లాల్ దర్వాజలోని సింహ వాహిని అమ్మవారికి బోనం ఎత్తుతారు.  దీంతో బోనాలు ముగుస్తాయి.  కానీ ఇంకా బోనాలు పండుగ చేయని ఊళ్లలో, గుళ్లలో ఆతరువాతి ఆదివారం బోనాలు సమర్పించి జాతరను ముగిస్తారన్నమాట.

ఈ పోతురాజు ఎవరో తెలుసా?

అమ్మవారి తమ్ముడైన పోతురాజు వేషాలు చూసే సమయం ఇదే.  పోతురాజుల విన్యాసాలు చూడచక్కగా ఉంటాయి.  ఇవన్నీ మంచి ఫీట్లుగా పిల్లా, పెద్దలకు మంచి వినోదం పంచుతాయి.   సాంస్కృతి కార్యక్రమాలు, జానపద నృత్య రూపకాలు బోనాల జాతరలో స్పెషల్ అట్రాక్షన్స్.

ఆదివారాలే ఎందుకు?

ఇన్ జనరల్ ఈ ఆషాఢ బోనాలు ఆషాడమాసం ఆదివారాలే చేస్తారు.  నిజానికి ఆషాడ మాసంలో ఏరోజైనా బోనాలు జరుపుకోవచ్చు.  కానీ ఆదివారం అయితే అందరికీ అనుకూలంగా ఉంటుందనేది ఇక్కడ ఉన్న అసలు కారణం.  ఇక ఆషాఢ మాసంలో బోనాలు సెలబ్రేట్ చేసుకోలేకపోతే కచ్ఛితంగా ఆ తరువాతి నెల అయిన శ్రావణ మాసంలో బోనాలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ ఆచారంగా వస్తోంది.

విజయవాడ దుర్గమ్మకు బోనం

విజయవాడలో దుర్గమ్మకు ఆషాఢ బోనం సమర్పించే సంప్రదాయం ఈ మధ్యనే స్టార్ట్ అయింది.  విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ సర్కారు బంగారు బోనం సమర్పిస్తోంది.  ఇక కోస్తా ఆంధ్రలోనివారంతా ఆషాఢమాసంలోదుర్గమ్మకు సారె సమర్పిస్తారు.  తమ శక్తికొద్దీ సారె ఇస్తే అమ్మవారు తమను చల్లగా చూస్తుందని భక్తుల అనుభవం.  జగన్మాత అయిన అమ్మవారికి ఏడాదికి నాలుగుసార్లు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు.  ఇందులో ఆషాఢమాసంలో వచ్చేవి వారాహి నవరాత్రులు అంటారు.  వారాహి నవరాత్రుల్లో మొక్కులను సారె రూపంలో తీర్చుకుంటారు.  పంటలు బాగా పండుతాయని, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు భావిస్తారు.  అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి వస్త్రాలు, పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, మిఠాయిలు తమ శక్తికొద్దీ సమర్పిస్తారు.  లక్షల మంది భక్తులు విజయవాడ దుర్గమ్మకు ఏటా ఈ సారె సమర్పిస్తారు. 

శాకాంబరి అలంకారం

శాకాంబరి అలంకారాలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయటం ఆషాఢంలో మరో సంప్రదాయం.  ఆషాఢ మాసంలో ఇలాంటి ఆచారాలు చాలా ఉన్నాయి.  కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, నట్స్, డ్రై ఫ్రూట్స్ తో తమ శక్తిమేర అమ్మవారికి అలంకారాలు చేస్తారు ఈనెలలో.  ఆతరువాత వీటినే ప్రసాదాలుగా భక్తులకు పంచిపెడతారు.  పోటాపోటీగా గుళ్లలో ఈ శాకాంబరి అలంకారాలు ప్రతి అమ్మవారి గుళ్లలో చేస్తారు.  ఇలా చేస్తే భక్తుల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం రాదని భక్తుల విశ్వాసం. 

అమ్మవారి అనుగ్రహం కోసం.. భక్తులు చేసే కూరగాయల అలంకారాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కన్నులపండువగా సాగుతాయి.  వరంగల్ భద్రకాళి అమ్మవారు, జూబ్లిహిల్స్ పెద్దమ్మ, విజయవాడ కనక దుర్గమ్మతోపాటు అన్ని ఊళ్లలోని అమ్మవార్లకు శాకాంబరి దేవి అలంకారం చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు.  చిన్నా పెద్ద అన్ని గుళ్లలో ఇది అతిపెద్ద సంప్రదాయం. ఇదంతా కన్నులపండువగా, సరదాగా సాగుతుంది.  లక్షల రూపాయాల ఖర్చుతో ఈ శాకాంబరి అలంకారాలు చేస్తారు. శాకాంబరి దేవిగా ఉన్న అమ్మవారి దర్శనం సకల శుభకరం.  కాబట్టి భక్తులు పోటెత్తి వస్తారు.  కూరగాయలతో అలంకారం చేయటంలో భక్తులు తమ క్రియేటివిటీ చూపిస్తూ ఈ విషయంలో వేరే టెంపుల్స్ తో పోటీ పడతారు.

పురాణ పఠనం

దేవీ భాగవతం, మార్కండేయ పురాణం వంటివి చదివేందుకు ఇది సరైన సమయం.  అందుకే ఆషాఢమాసంలో దత్తాత్రేయుడికి పూజలు, పూరీ జగన్నాథునికి అన్నప్రసాద నైవేద్యం, అమ్మవారికి బోనం, సారెలు ఇస్తూ ఎన్నో పురాణాల పారాయణలు చేస్తారు. అమ్మవారు తన దేహం నుంచి కూరగాయలు, పళ్లువంటివి సృష్టించి మనకు కడుపు నింపుతోంది. అందుకే మనం శాకాంబరిగా అమ్మవారిని కొలుస్తామన్నమాట.  పూజ అయ్యాక అలంకరణకు వాడిన పళ్లు, కూరగయాలన్నింటినీ కదంబం అనే ప్రసాదం రూపంలో పంపిణీ చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News