Significance of Ashada Masam: హిందువులకు పవిత్రమైన మాసాల్లో ఆషాఢం ఒకటి. ఆరోగ్యం, ఆస్ట్రాలజీ దృష్ట్యా ఈ మాసంలో కొన్ని పనులు చేయడం నిషేధించారు. సాధారణంగా ఆషాఢ మాసాన్ని శూన్య మాసంగా పిలుస్తారు. అందుకే ఈ నెలలో వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఉపనయానాలు వంటివి చేయకూడదు. అంతేకాకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించి నాలుగు నెలలపాటు అదే స్థితిలో ఉంటాడు. అందుకే ఈ మాసంలో ఏ పని చేసినా శ్రీహరి అనుగ్రహం లభించదని భావిస్తారు.
ఈ మాసంలోనే నూతన వధూవరులను దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం సాంప్రదాయంగా వస్తుంది. పూర్వకాలంలో పెళ్లిళ్లు ఆరు బయట పెద్ద పెద్ద పందిళ్ల కింద చేసేవారు. పైగా ఆషాఢ మాసం వర్షాకాలం ప్రారంభం కాబట్టి ఈదురు గాలుల, భారీ వర్షాల వల్ల ఈ కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడవచ్చని, వాతావరణ మార్పులు మూలంగా వచ్చిన అతిథులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆషాడంలో మాంసాహారం, మద్యం సేవించడం ఆపవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ చాతుర్మాసంలో వీటిని త్యజించడం ఉత్తమంగా భావిస్తారు. చాతుర్మాసంలో సాధువులు, సన్యాసులు ఒకే చోట స్థిరనివాసం ఏర్పరచుకుని కఠిన నియమాలు పాటిస్తారు. కొత్తగా బిజినెస్ ప్రారంభించేవారికి ఇది మంచి సమయం కాదు. వర్షాకాలంలో నదులు, కాలువల పొంగిపొర్లడం వల్ల దూర ప్రయాణాలు చేసేవారికి. తీర్థయాత్రలు చేసేవారికి అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో ఇంటి దగ్గర ఉండి పూజించడం మంచిది.